న్యూస్‌రీల్
● పోలీసులకు ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశం
పుట్టపర్తి అర్బన్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సతీష్ కుమార్ పోలీసులను ఆదేశించారు. గురువారం ఆయన పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను, పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్‌ను పరిశీలించారు. పెండింగ్ కేసుల స్థితి గతులను ఆరా తీశారు. నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, పురోగతిపై ఆరా తీయడంతో పాటు వివిధ కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంలోనే ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్ కేసులపై ఎస్పీ సమీక్షించారు. ప్రతి గ్రామంలోనూ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, పేకాట, మట్కా, గంజాయి వంటి వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పాత నేరస్తులపై కన్నేసి ఉంచాలన్నారు. డ్రోన్ కెమెరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్పీ వెంట సీఐ సురేష్, ఎస్‌ఐ క్రాంతి, సిబ్బంది ఉన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీకి
340 మంది గైర్హాజరు
పుట్టపర్తి అర్బన్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే 340 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 32 కేంద్రాల్లో తొలిరోజు జనరల్ విద్యార్థులకు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఒకేషనల్ విద్యార్థులకు జనరల్ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 1,681 మందికి గాను 1,387 మంది హాజరు కాగా, 294 మంది గైర్హాజరైనట్లు ఇంటర్‌విద్య జిల్లా అధికారి (డీఐఈఓ) చెన్నకేశవప్రసాద్ తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,115 మందికి గాను 1,069 మంది విద్యార్థులు హాజరు కాగా 46 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు.


