అనంతపురం/ తాడిపత్రి రూరల్: ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలని అఖిల భారత కెమిస్టుల సమాఖ్య బుధవారం మెడికల షాపుల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో అనంతపురం జిల్లాలో 1500, శ్రీసత్యసాయి జిల్లాలో 600 మందుల షాపులు మూతపడనున్నాయి. అన్‌లైన్ విక్రయాలకు 2018 అగస్టు 28న కేంద్ర ప్రభుత్వం ఈ – ఔషధి పేరిట జారీ చేసిన జీఓ 817ఎఫ్, 2020 మార్చిలో కరోనా సమయంలో జారీ చేసిన 220 తాత్కాలిక జీఓరద్దు చేయకుండా కొనసాగించడంపై మెడికల్ షాపుల నిర్వాహకులు ఆగ్రహంతో ఉన్నారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్లు లేకుండా అన్‌లైన్‌లో మందుల విక్రయాల వల్ల రోగుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదకర మందులను విక్రయిస్తూ రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాయని మెడికల్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు.
దెబ్బతింటున్న సమతుల్యం..
కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్‌ల వల్ల మార్కెట్ సమతుల్యం దెబ్బతింటోందని ఫార్మసిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున ఇచ్చే డిస్కౌంట్‌ల వల్ల సాధారణ ఫార్మసిస్టులు అర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లోని కెమిస్టుల మనుగడ ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిపోనున్న రూ.5కోట్ల అమ్మకాలు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో బుధవారం 2,100 మందుల దుకాణాలు మూతపడటం వల్ల దాదాపు రూ.5కోట్ల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. మెడికల్‌షాపుల బంద్ వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాన కేంద్రాల్లో ఒకటి, రెండు మెడికల్ షాపులను తెరిచే ఏర్పాట్లను చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
నేడు మందుల షాపుల బంద్
ఉమ్మడి జిల్లాలో 2,100 షాపుల మూత


