పెళ్లి కాలేదని యువకుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

పెళ్లి కాలేదని యువకుడి బలవన్మరణం

May 20 2026 10:43 AM | Updated on May 20 2026 10:43 AM

గుడిబండ: పెళ్లి కాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుడిబండ మండలం తాళికెర గ్రామానికి చెందిన తిమ్మప్ప కుమారుడు గోవిందరాజు (29) వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఏ ఒక్క సంబంధం కుదరకపోవడంతో ఇక తనకు పెళ్లి కాదంటూ మనోవేదనకు లోనైన గోవిందరాజు.. మంగళవారం తన పొలంలోని మేకల పాకలో ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు.

అధికారులమంటూ ఆభరణాల బ్యాగుతో పరారీ

గార్లదిన్నె: అధికారులమంటూ ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఓ వృద్ధుడిని బెంబేలెత్తించి అతడి వద్దనున్న బంగారు ఆభరణాల బ్యాగును లాక్కుని బైక్‌పై ఉడాయించారు. పోలీసులు తెలిపిన మేరకు... మర్తాడుకు చెందిన కృష్ణానాయక్‌ అనే వృద్ధుడు అనంతపురంలో చిన్న పిల్లల కమ్మలు, ముక్కుపుడకలు కొనుగోలు చేసి గార్లదిన్నె మండలంలోని గ్రామాల్లో ద్విచక్రవాహనంపై తిరుగుతూ విక్రయించి, జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఐదు జతల కమ్మలు, ముక్కుపుడకలు తీసుకుని పెనకచెర్ల డ్యాం, పెనకచెర్ల, పి.కొత్తపల్లి గ్రామాల్లో తిరిగినా వ్యాపారం కాలేదు. దీంతో ద్విచక్రవాహనంపై ఇంటికి తిరుగుముఖం పట్టాడు. సంజీవపురం డిస్ట్రిబ్యూటరీ కాలువ వద్దకు రాగానే వెనుక నుంచి ఇద్దరు అపరిచిత వ్యక్తులు బైక్‌పై వచ్చి అటకాయించారు. తాము సేల్స్‌ ట్యాక్స్‌ ఆఫీసర్లమని, బ్యాగును చెక్‌ చేయాలని అన్నారు. బంగారు ఆభరణాలు వ్యాపారం చేస్తానని చెప్పగా.. అతని బ్యాగును లాక్కుని బైక్‌లో వెళ్లిపోయారు. వారు ఎవరో తనను మోసం చేశారని గ్రహించిన కృష్ణానాయక్‌ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అపరిచితులు ఎత్తుకెళ్లిన బంగారు ఆభరణాల విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని తెలిపాడు. ఏఎస్‌ఐ అశ్వర్థనారాయణ కేసు నమోదు చేశారు.

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

బొమ్మనహాళ్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్న పలువురిని బొమ్మనహాళ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను రాయదుర్గం రూరల్‌ సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ నబీరసూల్‌ మంగళవారం సాయంత్రం వెల్లడించారు. అందిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం బొమ్మనహాళ్‌ మండలం దర్గాహొన్నూరు గ్రామ సమీపంలోని దర్గా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బెట్టింగ్‌ ఆడుతున్న 17 మంది యువకులు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ. 1.34 లక్షల నగదు, 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement