అగళి: మండలంలోని హనుమనపల్లిలో మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ ఆక్రమణను నిరసిస్తూ గ్రామస్తులు ఉద్యమించడంతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ సుబ్బారావు, ఎస్‌ఐ రంగడు యాదవ్ అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. వివరాల్లోకి వెళితే.. హనుమనపల్లి వీఆర్‌ఏగా పనిచేస్తున్న మల్లికార్జున తన తండ్రి కాటనాయక్ పేరిట 5 ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా తన భార్య కమల పేరుతో సర్వే నంబర్ 332–3లోని 76 సెంట్ల స్థలం, తల్లి పార్వతమ్మ పేరుతో సర్వే నంబర్ 332–2 లోని 5 ఎకరాల అసైన్డ్ భూమికి పట్టా చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారని, అలాగే శ్మశాన వాటికకు స్థలం అవసరం ఉందని, ఇవన్నీ కాదంటూ వ్యక్తిగతంగా ప్రభుత్వ భూమిని ఎలా పట్టా చేయించుకుంటావంటూ నిలదీశారు. దీనిపై మల్లికార్జున ఎదురు తిరగడంతో గ్రామస్తులందరూ ఏకమై పార్వతమ్మ పేరుతో చేసుకున్న ఐదు ఎకరాల భూమిలో నివేశన స్థలాల కోసం మంగళవారం కర్రలు పాతారు. ఆ స్థలాన్ని పేదలకు పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సుబ్బారావు, ఎస్‌ఐ రంగడు యాదవ్ అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చించారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని పరిశీలించారు.తహసీల్దార్ మాట్లాడుతూ.. గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలని, సదరు భూమిలోకి ఎవరు వెళ్లకూడదని సూచించారు. భూ ఆక్రమణపై సర్వే చేయించి తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో గ్రామస్తులు శాంతించారు.
భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఆందోళన


