పేదల స్థలాలపై కూటమి గద్దలు | - | Sakshi
Sakshi News home page

పేదల స్థలాలపై కూటమి గద్దలు

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

ధర్మవరం: పేదలకు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాలను కాజేసేందుకు కూటమి నాయకులు పన్నాగం పన్నడం విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ అరాచకం చర్చనీయాంశంగా మారింది. ముదిగుబ్బ మండల కేంద్రానికి సమీపంలో అనంతపురం–చైన్నె జాతీయ రహదారికి ఆనుకుని గుంజేపల్లి పొలం సర్వే నంబర్‌ 75లో 13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పేదల సొంతింటి కల సాకారం చేయాలన్న సంకల్పంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గుంజేపల్లి, ముదిగుబ్బకు చెందిన 80 మందికి రెండు సెంట్ల చొప్పున ఇక్కడ పట్టాలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.10 కోట్లకు పైగా పలుకుతోంది.

పాసు పుస్తకాలు సృష్టించి..!

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే బత్తలపల్లి మండలానికి చెందిన టీడీపీ ముఖ్య నేత, ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన ఓ బీజేపీ నాయకుడి కన్ను ఈ భూమిపై పడింది. పీసీరేవుకు చెందిన కంతేటి నారాయణ, రామస్వామి తండాకు చెందిన పార్వతి బాయి కుటుంబాలకు చెందిన వ్యక్తుల ద్వారా రంగ ప్రవేశం చేశారు. 2021లో ఫేక్‌ పాసు పుస్తకాలు మంజూరు చేసి జైలుకు వెళ్లి వచ్చిన అప్పటి తహసీల్దార్‌ అన్వర్‌ హుస్సేన్‌ ఇచ్చినట్లుగా పాసుపుస్తకాలు సృష్టించి తతంగానికి తెరలేపినట్లు తెలిసింది. ముదిగుబ్బ మండలం గుంజేపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని భూమికి తమకు 2021లోనే పాసుపుస్తకాలు ఇచ్చారని, వన్‌బీలో కూడా తమ పేరుందని చెబుతూ పొలాన్ని సర్వే చేసేందుకు ఇటీవల యత్నించడం వివాదాస్పదమైంది. స్థలంలోని రాళ్లను పీకేసి జేసీబీలతో చదును చేసేందుకు యత్నించగా బాధితులు తిరగబడ్డారు. కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసు కూడా వేశారు. అయితే కోర్టులో కేసు ఉన్నప్పటికీ మళ్లీ వారు రెండు రోజుల క్రితం కూటమి నాయకుల అండతో సర్వే చేసేందుకు రావడం గమనార్హం. ఈ క్రమంలోనే బాధితులు సర్వే ఆపివేయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముదిగుబ్బలో 6.90 ఎకరాల దురాక్రమణకు యత్నం

బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ.10 కోట్లకు పైనే

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో

పేదలకు పట్టాల మంజూరు

విచారణ చేస్తున్నాం

సర్వే నంబర్‌ 75–1కి సంబంధించి వివాదంపై విచారణ చేస్తున్నాం. సదరు స్థలంలో పట్టాలు ఇచ్చారని కొంత మంది, పొలం తమదని మరికొందరు రెవెన్యూ రికార్డులు, కోర్టు ఇంజెంక్షన్‌ ఆర్డర్‌ చూపుతున్నారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తాం.

–మహేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌, ముదిగుబ్బ

అంతా అనుమానాస్పదమే..

నారాయణస్వామి, పార్వతిబాయి చూపుతున్న ఆధారాలు అనుమానాస్పదంగానే ఉన్నాయి. సబ్‌ డివిజన్‌ చేయకుండానే భూమిని ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. వన్‌బీలో సర్వే నంబర్‌ 75–1లో ఇద్దరికి 3.5 ఎకరాలు,3.10 ఎకరాలు ఉన్నట్లు, అది కూడా పిత్రార్జితమని కనబరచడం గమనార్హం. గుంజేపల్లి పంచాయతీకి సంబంధం లేని వ్యక్తులకు ప్రభుత్వ భూమికి పట్టా ఎలా ఇస్తారు.. ఒకవేళ వారు చెప్పినట్లుగా 2021లో పట్టాలు మంజూరు చేసి ఉంటే అప్పుడు అసైన్‌మెంట్‌ కూడా జరగలేదు. పైపెచ్చు వీరికి సొంత పంచాయతీలలో పొలాలు ఉండడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement