ఊదరగొట్టి.. కష్టాల్లోకి నెట్టి | - | Sakshi
Sakshi News home page

ఊదరగొట్టి.. కష్టాల్లోకి నెట్టి

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

పుట్టపర్తి అర్బన్‌: తాము అధికారంలోకి రాగానే పెట్రోలు ధరలు తగ్గిస్తామంటూ గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన నారా లోకేష్‌ మాట తప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ విషయమే మరచిపోయారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మరింత పెంచినా నోరు మెదపడం లేదు. పెరిగిన ఇంధన ధరలతో జిల్లా వాసులపై ప్రతి నెలా రూ.1.30 కోట్ల అదనపు భారం పడనుండడం గమనార్హం.

బెంబేలెత్తుతున్న సామాన్యులు

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తోంది. సర్కారు అలసత్వం కారణంగా విత్తన ధరలు, కూలీ రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కక ఎటూ పాలుపోవడం లేదు. మరోవైపు విద్యుత్‌ చార్జీలు, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు, స్కూల్‌ ఫీజులు, వైద్య ఖర్చులు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

ఆటోలపై పిడుగు..

రాష్ట్రంలో సీ్త్ర శక్తి పథకం అమలుతో ఆటో రంగం కుదేలైంది. చాలా మంది తమ ఆటోలు అమ్ముకున్నారు. ఎటూపాలుపోని కొందరు చేసేదిలేక ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఈ సమయంలోనే డీజిల్‌, పెట్రోలు ధరలు పెంచడంతో ఆటోవాలాలు కూడా ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి. ఇప్పటికే ఆటోల్లో ప్రయాణికులు అంతంత మాత్రమే ఎక్కుతున్న నేపథ్యంలో.. మళ్లీ చార్జీలు పెంచితే వచ్చే వారు సైతం రారని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెట్రో ధరలు తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో లోకేష్‌ హామీ

అధికారంలోకి వచ్చాక

గాలికొదిలిన చినబాబు

నేడు కేంద్ర ప్రభుత్వం మరింత

పెంచినా నోరు మెదపని వైనం

దగాపై నేడు వైఎస్సార్‌ సీపీ నిరసనలు

నిలదీద్దాం.. నినదిద్దాం

ప్రజలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం పుట్టపర్తిలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ భారీ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం అందజేయనున్నారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు కూడా ర్యాలీలో పాల్గొని కూటమి ప్రభుత్వ తీరును నిలదీద్దామని శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement