పెనుకొండ రూరల్: చంద్రబాబు పాలనలో ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ సామాన్యులను బాదేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. ఆదివారం సోమందే పల్లిలోని మారుతీ నగర్‌లో నిర్వహించిన ‘కాఫీ విత్ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమంలో ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఇంటింటా తిరిగి స్థానికులతో మాట్లాడారు. అనంతరం పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయన్నారు. ఇప్పటికే వంట నూనె, గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలకు బతుకు భారంగా మారిందన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటకతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో లీటర్ పెట్రోల్ ధర వంద లోపే ఉందని, మన రాష్ట్రంలో చంద్రబాబు మాత్రం అదనపు ట్యాక్స్‌లు వేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. సంక్షేమ పథకాలను విస్మరించి, అమరావతి పేరుతో అప్పులు చేస్తున్నారన్నారు. రాజధాని ముసుగులో రైతులను దోచుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ధరలు కొద్దిగా పెరిగితేనే విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్ నేడు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. మంత్రి సవిత కూడా పెట్రోల్ బంక్ యజమాని అని, సామాన్యుల కష్టాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఇంధన ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను చంద్రబాబు ప్రభుత్వం నియంత్రించాలని, లేని పక్షంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ధ్వజం


