హెచ్‌ఐవీ బాధితులపై వివక్ష వద్దు | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ బాధితులపై వివక్ష వద్దు

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

పుట్టపర్తి అర్బన్‌: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బాధితులపై వివక్ష చూపకూడదని లెప్రసీ, ఎయిడ్స్‌, టీబీ అధికారి డాక్టర్‌ అనుపమ జేమ్స్‌ పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్‌ దీప స్మృత్యాంజలి దినం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్‌ వ్యాధితో బాధపడుతూ చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ప్రశాంతి గ్రామంలోని వై జంక్షన్‌ వరకూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుపమ జేమ్స్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌పై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందన్నారు. ఎయిడ్స్‌ దీప స్మృత్యంజలి 1983లో ప్రారంభమైందన్నారు. ప్రతి ఏటా మే నెల 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని 115 దేశాలలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎయిడ్స్‌ రోగులకు ఏఆర్‌టీ సెంటర్ల ద్వారా ఉచిత వైద్యం, మందులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 10,490 మంది ఎయిడ్స్‌/హెచ్‌ఐవీతో బాధపడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. 7,110 మంది క్రమం తప్పకుండా మందులు వాడుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా సూపర్‌వైజర్‌ రమణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సునీల్‌, ప్రభాకరరెడ్డి, కమ్యూనిటీ ఆఫీసర్లు శివరాం, వన్నప్ప, జనజాగృతి తదితరులు పాల్గొన్నారు.

లెప్రసీ, ఎయిడ్స్‌, టీబీ అధికారి డాక్టర్‌ అనుపమ జేమ్స్‌

Advertisement
 
Advertisement
Advertisement