ఈసారీ ముందస్తుగానే ‘నైరుతి’ | - | Sakshi
Sakshi News home page

ఈసారీ ముందస్తుగానే ‘నైరుతి’

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ఆశల ‘నైరుతి’ ఈసారి కూడా ముందస్తుగా ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళను తాకే ‘నైరుతి’ రుతుపవనాలు జూన్‌ రెండో వారంలోనే ఎక్కువగా జిల్లాను పలకరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ తొలిసారిగా గతేడాది అంటే 2025 ఖరీఫ్‌లో మే 26న జిల్లాలోకి ప్రవేశించాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఈనెల 29న పలకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చరిత్రను పరిశీలిస్తే జూన్‌ రెండో వారంలో చాలాసార్లు రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించాయి. అయితే గతేడాదితో పాటు ఈసారి దాదాపు వారం రోజులు ముందుగానే ‘నైరుతి’ పలకరించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి లక్షలాది హెక్టార్ల ఖరీఫ్‌ సాగుకు నైరుతి రుతుపవనాలు (సౌత్‌వెస్ట్‌ మాన్‌సూన్స్‌) అత్యంత కీలకం. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి.

నైరుతి వర్షాలపై ఖరీఫ్‌ ఆశలు..

ఉమ్మడి జిల్లా పరిధిలో వర్షాధారంగా దాదాపు 7 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో సాగులోకి వచ్చే పంటలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో కీలకమైన ఖరీఫ్‌ నాలుగు నెలల కాలంలో 321.5 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. జూన్‌లో 61.2 మి.మీ, జూలైలో 64.3 మి.మీ, ఆగస్టులో 84.4 మి.మీ, సెప్టెంబర్‌లో 111.6 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలపై ఆధారపడి ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 20 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్నతో పాటు మరో 15 రకాల పంటలు సాగు చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు రబీ కాలంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి.

భయపెడుతున్న ‘ఎల్‌–నినో’..

నైరుతి రుతుపవనాలు గతేడాది అనుకున్న దాని కన్నా 10 రోజులు ముందుగానే పలకరించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఖరీఫ్‌ పంటల సాగుకు కీలకమైన జూన్‌, జూలైలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అతికష్టమ్మీద పంటలు సాగులోకి వచ్చాయి. ఆగస్టులో మాత్రమే మంచి వర్షాలు కురిశాయి. అయితే ‘సూపర్‌ ఎల్‌–నినో’ అంటూ ఈసారి మూడు నెలలు ముందుగానే భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను మానసికంగా సిద్ధం చేస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నైరుతిపై ఎల్‌–నినో ప్రభావం వల్ల వర్షాలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతాయని, అవి కూడా గతి తప్పే ప్రమాదం ఉన్నట్లు ప్రకటనలు చేస్తుండటంతో ‘ముంగారు’ వ్యవసాయం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రభుత్వ ప్రకటనలతో ‘అనంత’లో ముందస్తుగానే కరువు మేఘాలు కమ్ముకున్నాయి.

గతేడాది మే 26న పలకరించినా పెద్దగా ప్రభావం చూపని వైనం

ఈసారి ఈనెల 29న రుతుపవనాల ప్రవేశం ఉంటుందని అంచనా

జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య

నైరుతి ప్రభావంతో జిల్లాకు వర్షాలు

ఈసారి సాధారణ వర్షపాతం నమోదు కాకపోవచ్చని ప్రకటన

అనంతపురం జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశం ఇలా..

Advertisement
 
Advertisement
Advertisement