బత్తలపల్లి: బ్యాంకుల్లో గోల్డ్ లోన్ పొందడం ఇక చాలా కష్టం. రూ.2 లక్షల వరకై తే ఫర్వాలేదు గానీ ఆపైన కావాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. గతంలో రైతులు పట్టాదారు పాసు పుస్తకాల సాయంతో బ్యాంకుల్లో బంగారు తాకట్టు పెట్టి రుణాలు పొందేవారు. కానీ ఇప్పుడు అలా కుదరదని ఆర్‌బీఐ తేల్చిచెబుతోంది. మే 1వ తేదీ నుంచి బంగారు రుణాల మంజూరుకు కఠిన నిబంధనలు విధించింది. గతంలో బంగారు తూకాల్నిబట్టి ఎంతమొత్తమైనా రుణంగా ఇచ్చేవారు. ఆర్బీఐ విధించిన తాజా నిబంధనలతో బంగారు తాకట్టు పెట్టుకుని ఎలాంటి నిబంధనలు లేకుండా కేవలం రూ.2.50 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. పాన్‌కార్డు ఉన్న రైతులకై తే రూ.5 లక్షల్లోపు, రూ.5 లక్షలు పైబడి రుణం పొందాలంటే ఇన్‌కంట్యాక్స్ చెల్లించే రైతులు మాత్రమే అర్హులని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. అది కూడా ఇప్పటికే ఉన్న ఇతర రుణాలు, ఈఎంఐలు లెక్కించి వాస్తవాదాయాన్ని బేరీజు ఎంతమేరకు రుణం తిరిగి చెల్లించగలరో అంత మొత్తానికే బంగారం తీసుకుని రుణం మంజూరు చేస్తామంటున్నారు. దీనిపై రైతులు పెదవివిరుస్తున్నారు.
అసలు.. వడ్డీ కట్టాల్సిందే..
బ్యాంకుల్లో తీసుకున్న బంగారు రుణాన్ని ఏడాదిలోపు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో అయితే బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి వడ్డీ మాత్రం కట్టించుకుని రెన్యూవల్ చేసేవారు. తాజాగా ఆర్బీఐ విధించిన నిబంధనల వల్ల వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల గతంలో అధిక మొత్తంలో బంగారుపై రుణం పొందిన రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ఆర్బీఐ విధించిన నిబంధనలను సడలించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంటున్నారు. లేకపోతే రైతులు, సామాన్యులు మళ్లీ వడ్డీవ్యాపారుల ధన దాహానికి బలయ్యే ప్రమాదం ఉందంటున్నారు.
నిబంధనలు మార్చకుంటే
ఉద్యమిస్తాం...
బంగారు రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ విధించిన నిబంధనలు దారుణంగా ఉన్నాయి. ఈ నిబంధనలు వల్ల రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. బ్యాంకులు కూడా రైతుల స్థితిగతులను గమనించి వారి సమస్యలను ఆర్బీఐ దృష్టికి తీసుకువెళ్లి నిబంధనలను వెంటనే సడలించేలా చూడాలి. లేనిపక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తాం. బ్యాంకులను ముట్టడించి కార్యకలాపాలను స్థంభింపజేస్తాం.
– కమతం కాటమయ్య,
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, రైతు సంఘం
బ్యాంకుల్లో ‘గోల్డ్ లోన్’ కష్టమే
కఠిన నిబంధనలు విధించిన ఆర్బీఐ
రుణం రూ.2 లక్షలు దాటితే
పాన్‌కార్డు ఉండాల్సిందే
ఐటీ రిటర్న్ ఫైల్ చేసి వారికే
రూ.5 లక్షలపైన రుణం
బంగారం చేతిలో ఉంటే బ్యాంకులో తాకట్టు పెట్టి నిమిషాల్లో రుణం పొందే రోజులకు కాలం చెల్లింది. ‘గోల్డ్ లోన్’పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను తీవ్రతరం చేసింది. దీంతో మీవద్ద ఎంత బంగారం ఉన్నా... తీసుకున్న రుణం చెల్లించగలిగే స్థాయిలో మీరు ఉన్నారన్న ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే రుణం
మంజూరయ్యే అవకాశం ఉంది. దీనివల్ల రైతులు, సామాన్యులు మళ్లీ ప్రైవేటు వ్యక్తుల వద్ద జీవితాలను తాకట్టుపెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.


