నెలరోజులు ఆగాల్సిందే
ఈ నెల 14 నుంచి వివాహ ముహూర్తాలు లేవు. ఈ నెల 18 నుంచి జూన్ 18 వరకూ మూఢమి వస్తోంది. అప్పుడు శుభ కార్యాలేవీ చేయకూడదు. పెళ్లికై నా..ఇంకే శుభ కార్యానికై నా మూఢమి తర్వాతే. అందువల్ల నెలరోజులు ఆగాల్సిందే.
– నరసింహాచార్యులు, ‘ఖాద్రీ’ ఆలయ ప్రధాన అర్చకులు
కదిరి: పెళ్లి లేదా గృహ ప్రవేశం..ఇలా ఏ శుభ కార్యానికై నా మంచి ముహూర్తం చూసుకుంటాం. ఏ రోజు బాగుందో అర్చక పండితులను అడిగి మరీ తేదీ ఖరారు చేస్తాం. అలాంటి శుభ కార్యాలకు నెల రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ నెల 13 వరకూ జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల జంటలు ఒక్కటయ్యాయి. ఈ నెల 13వ తేదీనే చివరి ముహూర్తం. హిందూ పంచాంగం ప్రకారం ఈ నెల 18 నుంచి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి)కావడంతో వివాహాది శుభ కార్యాలకు బ్రేక్ పడనుందని అర్చక పండితులు చెబుతున్నారు. మళ్లీ జూన్ 19 నుంచి శుభ ముహూర్తాలు ఉంటాయని వారంటున్నారు.
నెల రోజులు ఖాళీ..
శుభకార్యాలపై ఆధారపడి జీవిస్తున్న కొంతమంది మూఢమి కారణంగా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, పురోహితులు, డెకరేషన్ నిర్వాహకులు, పందిళ్లు వేసేవారు, పెళ్లి మండపాలు నిర్మించేవారు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ ఏర్పాటు చేసేవారు, పూలమాలలు కట్టేవారు..ఇలా ఎంతోమంది నెల రోజుల పాటు ఉపాధి కోల్పోనున్నారు.
ఈ ఏడాది శుభ ముహూర్తాలు ఇవే...
జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీలతో పాటు జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఆగస్టు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీలతో పాటు సెప్టెంబర్ 1, 3, 4, 5 తేదీల్లో శుభకార్యాలకు మంచి రోజులని పండితులు చెబుతున్నారు. ఇక అక్టోబర్ 11, 14, 29, 30 తేదీలతో పాటు నవంబర్ 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26 తేదీలు, డిసెంబర్ 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో శుభకార్యాలకు మంచి ముహూర్తాలున్నట్లు పండితులు చెబుతున్నారు.
రేపటి నుంచి జూన్ 18 వరకు
అధిక జ్యేష్ఠమాసం
నెలరోజుల పాటు
శుభకార్యాలకు బ్రేక్
జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాలు


