● ఐదురోజుల్లోనే బైక్‌పై
ఉమ్లింగ్లా శిఖరం అధిరోహణ
● గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న
ఓడీసీ యువకుడు
ఓడీచెరువు: సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు కష్టపడి చదివి సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్)గా రాణిస్తూనే బైక్‌పై పర్వతాలు అధిరోహిస్తూ సరికొత్త రికార్డు సృష్టించాడు. మండలంలోని రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెద్దసాని హనుమంతరెడ్డి కుమారుడు లోకేష్‌కుమార్ రెడ్డి దేశంలోనే అత్యంత ఎత్తైన పర్వత కనుమ ‘ఉమ్లింగ్లా’ను బైక్‌పై ఐదు రోజుల్లోనే అధిరోహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
హాబీతో అరుదైన గుర్తింపు..
సీఏ పూర్తి చేసిన లోకేష్ కుమార్‌రెడ్డి ప్రస్తుతం సొంతంగా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. వృత్తిరీత్యా క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ... బైక్‌పై సుదూర ప్రాంతాలకు వెళ్లడం హాబీగా మార్చుకున్నాడు. ఆ తర్వాత బైక్‌లపై పర్వతాలను అధిరోహించడాన్ని ఆస్వాదించేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల అరుదైన సాహసయాత్రకు శ్రీకారం చుట్టాడు. లడఖ్‌లోని 19,024 అడుగుల (5,798.25 మీటర్లు) ఎత్తైన ఉమ్లింగ్లా శిఖరాన్ని అధిరోహించేందుకు మే 8వ తేదీన సిద్ధమయ్యాడు. తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ కేవలం ఐదు రోజుల్లోనే (మే 13వ తేదీ) ఉమ్లింగ్లా శిఖరాన్ని విజయవంతంగా చేరుకున్నాడు. తన అసాధారణ సాహసంతో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం దక్కించుకున్నాడు.


