పుట్టపర్తి అర్బన్: ప్రజల భాగస్వామ్యంతోనే డెంగీ నియంత్రణ సాధ్యమవుతుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ బేగం అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ప్రశాంతి గ్రామంలోని వై జంక్షన్ వరకూ శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏదీ సాధ్యం కాదన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత వాతావరణం ఉంటే రోగాలు దూరమవుతాయన్నారు. స్వర్ణాంధ్ర కార్యక్రమాలో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ చెన్నారెడ్డి, ఎస్‌ఓ కళాధర్, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ హెచ్‌ఈఓ రామలక్ష్మి, సీహెచ్‌ఓ వన్నప్ప, సిబ్బంది ఫైరోజ్, నాగభూషణం, లక్ష్మీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీటెక్ విద్యార్థిని అదృశ్యం
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన సాంబశివయ్య కుమార్తె సానే దివ్యశ్రీ కనిపించకుండా పోయింది. పోలీసుల సమా చారం మేరకు... ఎస్కే యూ సమీపంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్‌ఈ–ఏఐఎంఎల్) మొదటి సంవత్సరం చదువుతున్న దివ్యశ్రీ ఈ నెల 15న ఉదయం 9.30 గంటల సమయంలో కళాశాలకని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కళాశాలలో ఆరా తీశారు. లాభం లేకపోయింది. బంధువులు, పరిచయ స్తులను విచారించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 99898 51996, 94901 06738, 94407 96807కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
రైలు నుంచి జారిపడిన యువకుడు
పెనుకొండ(సోమందేపల్లి): వేగంగా వెళుతున్న రైలు నుంచి ఓ యువకుడు (32) జారి కిందపడ్డాడు. సోమందేపల్లి మండలం చాకార్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అపస్మారకంగా పడి ఉన్న యువకుడిని వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాళ్లు, చేతులు విరిగాయని డాక్టర్లు వెల్లడించారు.
పోక్సో కేసులో బాలుడికి రెండేళ్ల జైలు
కదిరి అర్బన్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో బాల నేరస్తుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ జువైనైల్ జస్టిస్ బోర్డు, అనంతపురం ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ హారిక తీర్పు వెలువరించారు. వివరాలను కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ నిరంజన్‌రెడ్డి శనివారం వెల్లడించారు. 2020 మార్చి 11న కదిరి రూరల్ పరిధిలోని ఓ కాలనీలో రాత్రి సమయంలో ఆడుకుంటున్న బాలికపై అదే గ్రామానికి 13 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక కేకలు విన్న తల్లి అటుగా వెళ్లి చూడగా బాలుడు పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో బాలుడిపై ఐపీసీ 376, పోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు వాదనలు అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చాయి. తుది విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో బాలుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తి హారిక తీర్పు వెలువరించారు. దీంతో బాలుడిని తిరుపతిలోని పరిశీలనా కేంద్రానికి తరలించారు.
కారులో వచ్చి దోచుకెళ్లారు!
గుత్తి: స్థానిక ఆర్‌ఎస్‌లోని చంద్ర ప్రియనగర్‌లో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. కాలనీలో నివాసముంటున్న భాగ్యలక్ష్మి ఇంటికి తాళం వేసి పాతకొత్తచెరువుకు వెళ్లారు. తాళం వేసిన ఇంటిని గమనించిన ఐదుగురు దుండగులు దర్జాగా కారులో వచ్చి భాగ్యలక్ష్మి ఇంటి తాళం తెరిచి లోపలకు ప్రవేశించి బీరువాలోని రూ. 5 వేల నగదు, 30 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గమనించిన కాలనీ వాసులు అడ్డుకోబోగా కారులో ఉడాయించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. కాలనీవాసులు వెంట పడినా డ్రైవర్ కారు ఆపకుండా మూడు రౌండ్‌లు గిరగిరా తిప్పి శరవేగంగా దూసుకెళ్లిపోవడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.


