● యువతకు ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపు
కనగానపల్లి: వ్యసనాల బారిన పడకుండా స్ఫూర్తిదాయకమైన జీవనంతో సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువతకు ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు. చెన్నేకొత్తపల్లి కేంద్రంగా పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నీ శనివారం ప్రారంభమైంది. చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులకు, యువత మధ్య ఐక్యతను పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, బ్యాటింగ్ చేసి టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో రామగిరి సీఐ మహమ్మద్ అలి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి ఎస్‌ఐలు సత్యనారాయణ, మహమ్మద్ రిజ్వాన్, ప్రదీప్‌రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
హాట్‌టాపిక్‌గా దొంగనోట్ల యవ్వారం
చిలమత్తూరు: దొంగనోట్ల చలామణి అంశం ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల అదుపులో నిందితులు ఉండటంతో ఈ అంశంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. నకిలీ కరెన్సీ చలామణి అంశం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలువురు పేర్కొంటున్నారు. చిలమత్తూరు మండల కేంద్రంగా ఈ ముఠా నకిలీ నోట్లను చలామణి చేసినట్లుగా తెలుస్తోంది. మార్కెట్లు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలే ఇలాంటి మోసాలకు ఎక్కువగా గురయ్యారు. ఈ వ్యవహారంలో ఉన్న టీడీపీ నేతలు ఎవరనే ఆసక్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది. కాగా,నకిలీ కరెన్సీ చలామణి అంశంలో అసలు పాత్రధారులు ఎవరు అనే కోణంలో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
వ్యక్తి దుర్మరణం
గోరంట్ల: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన చాకలి వెంకటేశు(45) శనివారం గోరంట్ల వైపు నుంచి స్కూటీపై గాజులపల్లి గ్రామానికి వెళుతుండగా కరావులపల్లి తండా సమీపంలో అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న సీఐ శేఖర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, స్కూటీని వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతోనే వెంకటేశు మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
పరిగి: మండలంలోని జయమంగళి, పెన్నా నది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు జరిమానాలు విధించినట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.


