ధర్మవరం: నిరుపేదలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను ఆక్రమించుకునేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారి దౌర్జన్యాల నుంచి తమ స్థలాలకు రక్షణ కల్పించాలంటూ అధికారులకు బాధితులు విన్నవించారు. వివరాల్లోకి వెళితే... ముదిగుబ్బలోని సర్వే నంబర్ 75–1లో 80 మంది నిరుపేదలకు జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఈ స్థలం పక్కనే జాతీయ రహదారి ఉండడంతో విలువ గణనీయంగా పెరిగింది. దీంతో ఆ స్థలం తమదేనంటూ కంతే నారాయణ, పార్వతీబాయి శనివారం సర్వే అధికారులతో కలిసి అక్కడకు చేరుకుని కొలతలు తీసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న లబ్ధిదారులు అక్కడు చేరుకోగా వారితో వాగ్వాదానికి దిగారు. బాధితులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో సర్వేయర్లు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఇల్లు కట్టుకునే స్థోమత లేక ఇబ్బందులు పడ్డామని, అయితే ఆ భూమి తమదని, కూటమి నాయకుడు కొనుగోలు చేశారంటూ కొందరు కొత్తగా తెరపైకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. అసైన్‌మెంట్ భూమిని ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయమై ఇప్పటికే తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, న్యాయస్థానంలో కేసు కూడా నడుస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి తమ స్థలాన్ని రక్షించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుంజేపల్లి శంకర్, బాధితులు ఈశ్వరమ్మ, రామాంజినమ్మ, కాంతమ్మ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ మండలంలో బాధితుల ఆక్రందన


