అనంతపురం ఎడ్యుకేషన్: నీట్–2026 ప్రశ్నపత్రం లీకేజీపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షలాదిమంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి, కోచింగ్ తీసుకుని పరీక్షలకు సిద్ధమవుతుంటే కొందరు అక్రమ మార్గాల్లో ప్రశ్నపత్రాలను లీక్ చేసి విద్యావ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బ తీశారన్నారు. ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన అంశం కాకుండా, దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల ఆశయాలపై జరిగిన దాడిగా భావించాల్సి వస్తుందన్నారు. 2025లో జరిగిన ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించిన కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం లీకేజీల కారణంగా నిజాయితీతో చదువుకున్న విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలపై విద్యార్థులు, ప్రజల్లో నమ్మకం కోల్పోతే అది దేశ విద్యా వ్యవస్థకే ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష విధానలో పారదర్శకత, భద్రత, డిజిటల్ సెక్యూరిటీ, ప్రశ్నపత్రాల రవాణా, పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ వంటి అంశా ల్లో సమగ్ర మార్పులు తీసుకురావాలని సూచించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఎంవీ రామచంద్రారెడ్డి


