ఆలయ ప్రాశస్త్యం.. రాజకీయ ప్రాపకం | - | Sakshi
Sakshi News home page

ఆలయ ప్రాశస్త్యం.. రాజకీయ ప్రాపకం

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

చిలమత్తూరు: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేపాక్షి వీరభద్ర ఆలయ కమిటీ చైర్మన్‌ పదవి హాట్‌ కేక్‌లా మారింది. ప్రస్తుతం చైర్మెన్‌గా వ్యవహరించిన రమానందన్‌ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగియడంతో ఆ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఎలాగైనా ఆలయ కమిటీ చైర్మన్‌ పదవి దక్కించుకునేందుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పోటీ పడ్డారు.

లేపాక్షి ఆలయానికి రాజకీయ రంగు:

లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించిన తర్వాత భారీగా పర్యాటకులు సందర్శిస్తున్నారు. దీంతో ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆలయానికి చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు పైరవీలు ఊపందుకున్నాయి. ఇదే అదనుగా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు రంగంలో దిగి చైర్మన్‌ పదవిని అమ్మకానికి పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు అనుకూలంగా ఉన్న పరిగికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో ముడుపులు దండుకుని ఆలయ కమిటీ చైర్మన్‌ పదవి అంటగట్టేందుకు సిద్ధమైనట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరిన ఏడాదిలోనే ఆలయం వద్ద వాహనాల పార్కింగ్‌ వేలం పాటలోనూ ఎమ్మెల్యేల పీఏలు భారీగా అవకతవకలకు పాల్పడిన విషయం తెలిసిందే. చివరకు ఈ అంశంపై ఏసీబీ రంగంలో దిగి విచారణ చేపట్టడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. తాజాగా చైర్మన్‌ పదవి అంశంలోనూ మితిమీరిన రాజకీయ జోక్యంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

హాట్‌ కేక్‌లా మారిన లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్‌ పదవి

పోటీ పడుతున్న రియల్టర్లు

స్థానికులను కాదని బయటి వ్యక్తులకు పదవి కట్టబెట్టే ప్రయత్నం

ఎమ్మెల్యే బాలయ్య పీఏల తీరుపై స్థానిక కూటమి నేతల్లో అసహనం

స్థానిక నేతల్లో అసంతృప్తి

లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్‌ను స్థానికులకు కాకుండా స్థానికేతరులకు కట్టబెడుతుండడంపై లేపాక్షి టీడీపీ నేతల్లో అసంతృప్తి రగిల్చింది. ఇప్పటికే ఎమ్మెల్యే మొదలు పీఏలు.. ఇతర కీలకమైన పదవుల్లో స్థానికేతరులకే పట్టం కట్టడంపై విసిగిపోయిన టీడీపీ నేతలు అధిష్ణానం తీరుపై మండిపడుతున్నారు. ఎంత కాలం తాము జెండాలు మోయాలంటూ ప్రశ్నిస్తున్నారు. లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్‌ పదవిని స్థానికులకే ఇవ్వాలని కూటమిలోని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అలా కాదని స్థానికేతరులకు కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని బహిరంంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement