ధర్మవరం: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని ప్రియాంక నగర్‌లో నివాసముంటున్న రామిరెడ్డి కుమారుడు లక్ష్మీరెడ్డి (25) ఎలక్ట్రీషియన్‌గా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుకున్న ఆయన తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో ఇంటికి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటి తర్వాత తండ్రి రామిరెడ్డి నిద్ర లేచి కుమారుడి కోసమని బయటకు వచ్చి చూడగా బంక్‌కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న లక్ష్మీరెడ్డి కనిపించడంతో పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, లక్ష్మీరెడ్డి ఆత్మహత్యకు ప్రధాన కారణం అప్పుల బాధలేనని స్థానికులు తెలిపారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేకనే తనువు చాలించినట్లుగా సమాచారం.
మాట నిలబెట్టుకున్న గురువు
రాప్తాడు రూరల్: విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని చదవాలని ప్రోత్సహిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఓ ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బీకే నారాయణ.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయిస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పట్టుదలతో చదువుకున్న విద్యార్థిని ఈ.రాజిత 563 మార్కులు సాధించడంతో శుక్రవారం ఉదయం 7 గంటలకు తన సతీమణి పద్మావతి (వ్యవసాయ శాఖ సూపరింటెండెంట్)తో కలిసి రాజితను బెంగళూరు నుంచి విజయవాడకు విమానంలో ఉపాధ్యాయుడు నారాయణ పిలుచుకెళ్లారు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారి దర్శనం చేయించడంతో పాటు ప్రసిద్ధ ఉండవల్లి గుహలను చూపించారు. సాధారణ కుటుంబానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని తొలిసారి విమానంలో ప్రయాణించడం ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మారింది.


