రొద్దం: ఎద్దుల బండిని లారీ ఢీకొన్న ఘటనలో ఓ రైతు మృతి చెందగా, మరొకరితో పాటు ఎద్దులకూ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు... రొద్దం మండలం చెరుకూరు గ్రామానికి చెందిన రైతు కురుబ పుట్టప్ప (69) శుక్రవారం ఉదయం ఎద్దుల బండి కట్టుకుని తన పొలానికి బయలుదేరాడు. ఈ క్రమంలో తన పొలం పక్కనే ఉన్న మహిళా రైతు ప్రమీల కూడా అదే ఎద్దుల బండిని ఎక్కారు. మార్గం మధ్యలో ప్రధాన రహదారిపైకి చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొంది. రైతులిద్దరితో పాటు రెండు ఎద్దులకూ తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పుట్టప్ప మృతి చెందగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రమీలను బెంగళూరుకు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
కారు బోల్తా పడి..
పెనుకొండ: కారు బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... చేనేత వృత్తితో జీవనం సాగిస్తున్న సోమందేపల్లికి చెందిన పవన్ (32) శుక్రవారం ఉదయం పట్టు చీరల కలెక్షన్ కోసం ధర్మవరానికి కారులో వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఆయన.. పెనుకొండ సమీపంలోని ఆర్‌సీపీఎల్ కంపెనీ వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై నియంత్రణ కోల్పోవడంతో కారు ఒక్కసారిగా రోడ్డు పక్కన పల్లంలోకి బోల్తా కొట్టింది. అటుగా వెళుతున్న వారి సమాచారంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


