కదిరి: విద్యారంగంలో నూతన సంస్కరణల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పటికే పలు రకాల యాప్‌లతో ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుండగా.. తాజాగా వారిపై ‘టెట్’ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) బాంబు వేసింది. 2010కి ముందు ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులంతా ‘టెట్’ రాసి అర్హత సాధిస్తేనే పదోన్నతులు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులందరూ రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలని, లేని పక్షంలో ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పదవీ విరమణకు ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇచ్చినప్పటికీ వారికి కూడా పదోన్నతులు రావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీనియారిటీ జాబితాలో మార్పులు..
జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకూ బోధించే పాఠశాలలు 2,078 ఉండగా, ఆయా పాఠశాలల్లో మొత్తంగా 8,307 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రభుత్వం టెట్‌పై ఇటీవల ఇచ్చిన ఆదేశాల ప్రకారం... సుమారు 4 వేల మంది దాకా ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాల్సి ఉంది. లేని పక్షంలో పదోన్నతులు కోల్పోవడంతో పాటు చివరికి ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల వ్యక్తిగత వివరాలు, సర్వీసు రికార్డులతో పాటు వారు టెట్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు?..ఎన్ని మార్కులు సాధించారు?..ఈ అంశాలన్నీ సీనియారిటీ జాబితా ప్రత్యేక కాలంలో పొందు పరచాలని జిల్లా విదాశాఖ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. టెట్ పాసైన వారి పేర్లు మాత్రమే స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్–2 హెచ్‌ఎం పదోన్నతుల జాబితాలో ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.
వీరికి మినహాయింపు..
టెట్ అర్హత పరీక్షకు సంబంధించి 2010 ఆగస్టు 23న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ)కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకానికి ‘టెట్’ ఉత్తీర్ణత తప్పనిసరిగా పేర్కొంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ జీఓ జారీ కంటే ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న వారికీ మినహాయింపు ఇచ్చారు. 2012 తర్వాత డీఎస్సీతో పాటు ‘టెట్’ కంపల్సరీ చేసిన సంగతి తెలిసిందే.
మాట తప్పిన తండ్రీ కొడుకులు..
‘‘ఇన్ సర్వీస్ టీచర్లు ఎవ్వరూ ‘టెట్’ నిబంధనకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాం. అవసరమైతే పార్లమెంట్‌లో చట్ట సవరణ కూడా చేస్తాం’ అని గతంలోనే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు నోరు మెదపకపోవడంతో టీచర్లు మండిపడుతున్నారు. తప్పనిసరి పక్షంలో మాకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని కొందరు టీచర్లు సూచిస్తుంటే, మరికొందరేమో ‘20, 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాం. ఈ వయసులో మాకు ఈ పరీక్షేంటి?’ అని భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
పరీక్ష పాసైతేనే
ఉపాధ్యాయులకు పదోన్నతులు
రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత
కాకపోతే ఇంటికే
కలవరపెడుతున్న
విద్యాశాఖ నిర్ణయాలు
సీనియర్ ఉపాధ్యాయుల్లో ఆందోళన
కష్టమైన పరీక్షే..
ఎప్పుడో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ పాస్ కావాలంటే కాస్త కష్టమే. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే ఓసీలు 90 శాతం, బీసీలు 60 శాతం, ఎస్సీలు 50 శాతం మార్కులు సాధించాలి. అయితే టెట్ పేపర్–1 పాస్ కావాలంటే చైల్డ్ డెవెలప్‌మెంట్, తెలుగు, ఆంగ్లం, గణితం, పర్యావరణానికి సంబందించిన అంశాలన్నీ చదవాలి. పేపర్–2లో కూడా అదే పరిస్థితి. బయో సైన్స్ ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్ స్టడీస్, ఇలా సంబంధం లేని సబ్జెక్టులు పెట్టి పాస్ కావాల్సిందే..అంటే ఎలా? అని టీచర్లు ఆగ్రహిస్తున్నారు.


