ప్రశాంతినిలయం: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం సత్యసాయి సన్నిధిలో గడిపారు. శుక్రవారం బ్రాహ్మణపల్లి వద్ద అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాప్ట్ (ఏఎంసీఏ) డిఫెన్స్ ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేసిన ఆయన కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబుతో కలిసి ప్రశాంతినిలయానికి చేరుకున్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహాసమాధిపై పూల మాలలు, బొకేలు ఉంచి ప్రార్థించారు. అనంతరం యజుర్ మందిరంలోనూ కాసేపు గడిపారు. వారి వెంట సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సవిత, పయ్యావుల కేశవ్, ఎంపీ పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్ తదితరులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల్లో చోటు
పుట్టపర్తి అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు స్థానం దక్కింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన తాడిమర్రి మనోజ్‌కుమార్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వీఎస్ రామాంజనేయులు, అలాగే మడకశిర నియోజకవర్గానికి చెందిన పి. మధుసూదన్‌ను పార్టీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా ఉపాధ్యక్షుడిగా జాఫర్‌ఖాన్
వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కదిరి నియోజకవర్గానికి చెందిన పఠాన్ జాఫర్ ఖాన్‌ను నియమించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
పుట్టపర్తిలో డయాలసిస్
సెంటర్ ప్రారంభం
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు నిర్వహిస్తున్న పాలియేటివ్ సెంటర్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని శుక్రవారం మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ శ్యాం ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలియేటివ్ సెంటర్‌లో అందుతున్న సేవలు స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. అనంతరం సమీపంలోనే రూ.7.4 కోట్ల వ్యయంతో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వారి వెంట డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం, సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
పోలీసుల అదుపులో
దొంగనోట్ల చలామణి ముఠా?
● పట్ట్టుబడిన వారిలో
టీడీపీ నేతల ప్రధాన అనుచరులు!
సాక్షి, పుట్టపర్తి: హిందూపురంలో దొంగ నోట్లను చలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. రెండు రోజుల క్రితం హిందూపురం రూరల్ మండల పరిధిలో ఆరుగురు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. అయితే ముఠా వెనుక ఉన్న అసలు నేరస్తులను గుర్తించే పనిలో భాగంగా ముఠా సభ్యులను పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా, పట్టుబడిన నిందితుల్లో చిలమత్తూరు మండల టీడీపీ నేతల ప్రధాన అనుచరులు ఉన్నట్లుగా వదంతులు వ్యాపించాయి. నేర చరిత్ర కలిగిన వాళ్లను మండలంలోని కొందరు టీడీపీ నేతలు ప్రోత్సహిస్తూ దొంగనోట్లు చలామణిలో వాడుకుంటున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి.


