నేడు పుట్టపర్తికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పుట్టపర్తికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

సీఎం చంద్రబాబుతో కలిసి

యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు భూమి పూజ

పుట్టపర్తి అర్బన్‌/ప్రశాంతినిలయం: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం పుట్టపర్తికి విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బ్రాహ్మణపల్లి వద్ద ఏర్పాటుకానున్న యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక సాయి ఆరామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకొని జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అనంతరం పట్టణంతో పాటు ప్రశాంతి గ్రామం, సభాస్థలి, విమానాశ్రయం వద్ద బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.

నేడు పుట్టపర్తికి చంద్రబాబు రాక

సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తి విమానాశ్రయానికి 9.15 గంటలకు చేరుకుంటారు. 10.15 గంటలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ ఫ్లైట్‌ టెస్ట్‌ సెంటర్‌, ఏడీఏ, అండ్‌ ట్యాక్టికల్‌ డిఫెన్స్‌ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఏఎంసీఏ శంకుస్థాపనతో పాటు వివిధ డిఫెన్స్‌ , డ్రోన్‌ ప్రాజెక్టులకు భూమి పూజల్లో పాల్గొంటారు.

బాల్య వివాహంపై

కేసు నమోదు

కదిరి టౌన్‌: మండల పరిధిలోని అబ్బావాండ్లపల్లికి చెందిన బాలిక (17)కు అదే గ్రామానికి చెందిన రోహిణి కుమార్‌తో వారి తల్లిదండ్రులు మున్సిపల్‌ పరిధిలోని సైదాపురం ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం జరిపించారు. విషయం ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ లక్ష్మీదేవి దృష్టికి రావడంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పెళ్లి చేసుకున్న రోహిణి కుమార్‌, అమ్మాయి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. బాల్య వివాహాలను ఎవరూ చేయకూడదని, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

సమగ్ర శిక్ష ఏపీసీగా వెంకటేష్‌

పుట్టపర్తి: సమగ్ర శిక్ష అసిస్టెంట్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా వెంకటేష్‌ను నియమించారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ అయిన వెంకటేష్‌ వైఎస్సార్‌ కడపలో పని చేస్తున్నారు. తాజాగా ఆయన్ను ఫారిన్‌ సర్వీస్‌ కింద జిల్లాలో సమగ్ర శిక్ష ఏపీసీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

లోకేష్‌ పర్యటనకు రావాలని కూలీలకు బెదిరింపులు

ధర్మవరం రూరల్‌: బత్తలపల్లి పర్యటనకు వస్తున్న విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌ కార్యక్రమానికి ఉపాధి హామీ పథకం కూలీలందరూ తప్పక రావాలని మండల పరిధిలోని గొట్లూరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చిరంజీవి బెదిరించారని గ్రామానికి చెందిన పలువురు కూలీలు వాపోయారు. ఈ పంచాయతీలో కూలీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీంతో జనసమీకరణ కోసం నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా ఉపాధి కూలీలను తరలించే విధంగా స్థానిక పీల్డ్‌ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. దీంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కూలీల ఇళ్ల వద్దకు వెళ్లి కచ్చితంగా లోకేష్‌ పర్యటనకు రావాల్సిందేనని బెదిరింపులకు దిగారంటున్నారు. పర్యటనకు రాకపోతే ఉపాధి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించమని చెబుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే బత్తలపల్లికి రారో వారి ముఖ హాజరు తీసేదేలేదని హెచ్చరిస్తున్నారన్నారు.

టన్ను మామిడి రూ.40 వేలు

అనంతపురం అగ్రికల్చర్‌: కక్కలపల్లి మార్కెట్‌లో గురువారం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.40 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్‌ తెలిపారు. మార్కెట్‌కు 260 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.15 వేల ప్రకారం ధర పలికాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement