నేటి నుంచి ‘సత్యసాయి’ కార్మికుల సమ్మె | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘సత్యసాయి’ కార్మికుల సమ్మె

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

బత్తలపల్లి: సత్యసాయి రక్షిత తాగునీటి పథకం కార్మికులు సమ్మె సైరన్‌ మోగించారు. నేటి నుంచి (5వ తేదీ నుంచి) నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు. సోమవారం వారు బత్తలపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పథకం నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు తమకు బకాయిగా ఉన్న 5 నెలల వేతనం మంజూరు చేయాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగినట్లు వెల్లడించారు. 1997 నుంచి 2019 వరకు సత్యసాయి రక్షిత తాగునీటి పథకం సవ్యంగా నడిచిందన్నారు. 2019 నుంచి ఈ పథకం నిర్వహణకు బడ్జెట్‌ కేటాయించకుండా రాష్ట్ర స్థాయి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. సమ్మె చేస్తేనే బడ్జెట్‌ గురించి, నీటి పథకం గురించి ఆలోచించే ఆనవాయితీ ఏర్పడిందన్నారు. 2025–2026 సంవత్సరానికి సత్యసాయి రక్షిత తాగునీటి పథకం నిర్వహణకు రూ.35 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం రూ.13.7 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. దీంతో పథకం నిర్వహణ ఇబ్బందిగా మారిందన్నారు. ఇక 2026–27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సత్యసాయి తాగునీటి పథకానికి రూపాయి కూడా కేటాయించలేదన్నారు. దీనిబట్టి చూస్తే సత్యసాయి రక్షిత తాగునీటి పథకాన్ని నడిపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదా? అనే సందేహం వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లోనే తాము సమ్మెకు సిద్ధమయ్యామన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకుని సమ్మెకు సహకరించి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు.

రాగిజావ పంపిణీకి లైన్‌ క్లియర్‌

సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌తో సర్కార్‌ ఎంఓయూ

ప్రశాంతి నిలయం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రాగిజావ అందించేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌తో ఎంఓయూ కుదుర్చుకుంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా రాగిజావ అందించేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని 2026 నుంచి 2029 వరకు కొనసాగించేందుకు సోమవారం అమరావతిలో విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో ట్రస్ట్‌ సభ్యులు కలిసి ఎంఓయూపై సంతకాలు చేసినట్లు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు గ్లాసు రాగిజావను అందజేస్తారన్నారు.

గ్యాస్‌ సిలిండర్ల కోసం ధర్నా

రొళ్ల: గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసి వారం రోజులు దాటుతున్నా... ఏజెన్సీ నిర్వాహకులు సరఫరా చేయకపోవడంతో రొళ్లలో పలువురు వినియోగదారులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్‌ సిలిండర్ల సరఫరా తీవ్ర జాప్యం చేస్తున్నారు. నియోజకవర్గంలోని మిగతా మండలాల వారికి సిలిండర్‌ బుక్‌ చేసినా రెండు, మూడు రోజులకే సరఫరా అవుతోంది. కానీ రొళ్ల మండలంలోని వినియోగదారులు సిలిండర్‌ బుక్‌ చేసి 15 రోజులు దాటినా సరఫరా కావడం లేదు. ఈ క్రమంలో సోమవారం వారంతా స్థానిక బస్డాండ్‌ ఆవరణలో ఖాళీ సిలిండర్లతో ధర్నాకు దిగారు. తమకు గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసేంత వరకూ ఆందోళన విరమించబోమన్నారు. స్పందించిన స్థానిక గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు సాయంత్రంలోపు సిలిండర్లు సరఫరా చేస్తామన్నారు. దీంతో వారంతా ఆందోళన విరమించగా.. సాయంత్రం 4 గంటలకు 80 శాతం మంది వినియోగదారులకు గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement