భక్తిపారవశ్యం.. జ్యోతుల ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిపారవశ్యం.. జ్యోతుల ఉత్సవం

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

రొళ్ల: రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం జ్యోతుల ఉత్సవం వైభవంగా జరిగింది. రత్నగిరితో పాటు గుడ్డగుర్కి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవికి గ్రామస్తులు జ్యోతులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ప్రత్యేక అలంకరణలో లక్ష్మీదేవి..

ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం అమ్మవారి మూలవిరాట్‌ను, ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు పట్టువస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో విశేషంగా అలంకరించారు. సుప్రభాత సేవ మొదలుకుని అంకురార్పణ, అభిషేకం, కుంకుమార్చన పూజలు చేసి మహా మంగళ హారతి ఇచ్చారు. ప్రత్యేక అలంకరణలో కనిపించిన అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

చల్లంగ చూడు తల్లీ..

సాయంత్రం మహిళలు నియమనిష్టలతో జ్యోతులను సిద్ధం చేసుకుని పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ తిరిగి గర్భగుడిలోని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నారు. అందరినీ చల్లంగ చూడు తల్లీ అంటూ ప్రార్థించారు. జ్యోతుల ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మొక్కుబడుల్లో భాగంగా అమ్మవారికి పొట్టేళ్లు, మేకలు, కోళ్లను బలి ఇచ్చారు. సాయంత్రం విందు భోజనాలు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు, వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాలో ఉన్నవారు కూడా ఉత్సవానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో రాజవంశీకుడు దొర రంగప్పరాజు, కై వాడస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

కిక్కిరిసిన రత్నగిరి..

లక్ష్మీదేవి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన జ్యోతుల ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో రత్నగిరి గ్రామం కిక్కిరిసిపోయింది. గ్రామంలోని ఏ ఇళ్లు చూసినా బంధువులతో కళకళలాడుతూ కనిపించింది. ఇక ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తినుబండారాల అంగళ్లు కిటకిటలాడాయి. గాజుల అంగళ్ల వద్ద మహిళలు, చిన్నారులు రద్దీ పెరిగింది. గ్రామస్తులు స్నేహితులు, బంధువులకు గాజులు వేయించి ముచ్చట తీర్చుకున్నారు.

నేడు వివిధ గ్రామాల్లో

జ్యోతుల ఉత్సవాలు..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం టీడీ పల్లి, హెచ్‌ఎం పల్లి, వన్నారనపల్లి, హులీకుంట, బాజయ్యపాళ్యం, కొత్తపాళ్యం, కొడగార్లగుట్ట, హొట్టేబెట్ట, దాసప్పపాళ్యం, జీఎన్‌ పాళ్యం, వన్నప్పపాళ్యం, అలుపనపల్లి, ఏ.గొల్లహట్టి, దొమ్మరహట్టి, రొళ్లకొండ తదితర గ్రామాల్లో అమ్మవారికి జ్యోతుల నిర్వహించనున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.

సంప్రదాయ కట్టు, బొట్టుతో

మహిళలు... వివిధ పుష్పాలతో

అలంకరించిన కలశాలు.. వాటిపై అమ్మవారి కోసం వెలిగించిన

జ్యోతులు.. డప్పు దరువులు..

భక్తుల ఆనందోత్సాహాల నడుమ రత్నగిరిలో భక్తిపారవశ్యం ఉప్పొంగింది. ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరిసింది.

వైభవంగా మహాలక్ష్మీదేవి

జ్యోతుల ఉత్సవం

వందలాదిగా తరలివచ్చిన భక్తులు

అమ్మవారికి జ్యోతులను

సమర్పించిన మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement