రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి రథోత్సవం కనులపండువగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించగా..ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. రథం లాగి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయమే అమ్మవారి మూలవిరాట్‌ను పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన, తులసీపూజ చేసి మహా మంగళ హారతి ఇచ్చారు. రథం ముందు వేద పండితులు శాంతి, నవగ్రహ హోమం, యోగీశ్వరారాధన, గణపతి పూజ చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించిన అర్చకులు... మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం ప్రాంగణం, రథం చుట్టు ప్రదక్షిణలు చేసి విగ్రహాన్ని రథంలో కొలువుదీర్చారు.
మార్మోగిన అమ్మవారి నామస్మరణ..
రథంపై కొలువుదీరిన అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని చూపి భక్తులంతా నమో మహాలక్ష్మీ అంటూ కీర్తించారు. రథంపైకి అరటి పండ్లు, పూలు, తమలపాకులు తదితర వాటిని విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులంతా అమ్మవారిని కీర్తిస్తూ రథాన్ని ఆలయ ప్రాంగణం నుంచి సమీపాన ఉన్న ప్రధాన రోడ్డు వరకు లాగారు. గ్రామానికి చెందిన బ్రాహ్మణులు రాజవంశీకులతో కలిసి అమ్మవారికి జ్యోతులు సమర్పించారు. అంతకుముందు వారంతా జ్యోతులను ఊరేగింపుగా మోసుకువచ్చి ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించారు. విశేష పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థానం దొర రంగప్పరాజు, కైవాడస్తులు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కాగా, రథోత్సవంలో దొంగలు చేతివాటం చూపారు. పలువురు భక్తుల జేబులు కత్తిరించి సొమ్ము కాజేశారు. నేడు గంగపూజ..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి గంగ పూజ నిర్వహించనున్నారు.
వైభవంగా కొల్హాపురి మహాలక్ష్మీ బ్రహ్మరథోత్సవం
వేలాదిగా తరలివచ్చిన భక్త జనం


