పెనుకొండ: సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో సోమవారం వివాహిత ఈడిగ ఆనందమ్మ (52) ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ తెలిపిన మేరకు... కొద్ది రోజులుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందమ్మకు బెంగళూరులోని నిమ్హాన్స్‌తో పాటు హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. సోమవారం ఉదయం పాపిరెడ్డిపల్లి గ్రామ పరిసరాల్లో వ్యవసాయ బావిలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పాటు ఇటీవల ఆయాసం, దగ్గు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కదిరి టౌన్: కన్న కొడుకునే హతమార్చిన కేసులో తండ్రిని అరెస్ట్ చేసినట్లు కదిరి పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో ఈ నెల 1న కొమ్మినేని గణేష్‌నాయుడును తండ్రి నారాయణస్వామి రొకలి బండతో కొట్టి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న నారాయణస్వామిని సోమవారం సైదాపురం వాటర్ ట్యాంక్ వద్ద గుర్తించి అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
నిందితుడికి రిమాండ్
చిలమత్తూరు: యువకుడిని బ్యాట్‌తో కొట్టి హతమార్చిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ మునీర్ అహమ్మద్ తెలిపిన మేరకు... చిలమత్తూరు మండలం పలగలపల్లి పంచాయతీ బందేపల్లికి చెందిన రమేష్(33)కు భార్య, పదేళ్ల వయసున్న కుమార్తె, ఏడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవపడి సోమఘట్టలోని పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను పిలుచుకువచ్చేందుకు ఈ నెల 2న రమేష్ వెళ్లాడు. ఆ సమయంలో అత్తింటిలో గొడవ చోటు చేసుకోవడంతో సమీప బంధువు శ్రీనివాసులు బ్యాట్ తీసుకుని రమేష్ తలపై బాదాడు. ఘటనతో అపస్మారక స్థితికి చేరుకున్న రమేష్‌ను కుటుంబసభ్యులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం రమేష్ మృతి చెందాడు. ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనివాసులును అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
ఇద్దరు ఎస్‌ఐలకు స్థాన చలనం
పుట్టపర్తి టౌన్: జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐలకు స్థాన చలనం కల్పిస్తూ ఎస్పీ సతీష్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ కురుబ నరసింహుడును రొళ్ల పీఎస్‌కు బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎం.గౌతమిని వీఆర్ పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇటీవల కౌన్సెలింగ్ నిర్వించిన పలువురు హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లుకు సోమవారం డీఓ ఆర్డర్లు జారీ చేశారు.


