ధర్మవరం: మండలంలోని ధర్మపురి గ్రామంలో వెలసిన రామస్వామి ఆలయానికి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. అనునిత్యం ఈ ఆలయంలో నిత్య కై ంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో ఏటా శ్రీరామనవమి నాడు క్షత్రియ వంశానికి చెందిన వారు నీటితో దీపం వెలిగిస్తుంటారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం శ్రీరామనవమి నాడు ఈ అద్భుతాన్ని కనులారా చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి.
శ్రీరామ నవమి రోజున ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ ఆలయంలో క్షత్రియ వంశానికి చెందిన రాఘవరాజు ఉపవాస దీక్షతో పూజలు చేస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయానికి చేరుకున్న వేలాది మంది భక్తులతో కలసి గ్రామ శివారున ఉన్న వంక వద్దకు చేరుకుంటారు. స్నానం ఆచరించిన తర్వాత మడి దుస్తులతో రాగి చెంబులో నీటిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అప్పటికే ఆవు నెయ్యితో వెలుగుతున్న దీపంలోకి నీటిని పోయగానే అది ఆరిపోకుండా మరింత దేదీప్యమానంగా వెలగడం గమనించిన భక్తులు జయజయధ్వానాలతో హోరెత్తిస్తుంటారు. సాధారణంగా వెలుగుతున్న దీపంలోకి నీటిని పోయగానే అది చిటపటలాడుతూ ఆరిపోవడం సహజం. అయితే ఇందుకు విరుద్ధంగా నీటిని పోయగానే దేదీప్యమానంగా వెలుగొందే దీపాన్ని తీసుకుని భజనలు చేస్తూ గ్రామంలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుంటారు. ఈ క్రమంలో మధ్య మధ్యలో రాగి చెంబులోని నీటిని దీపంలో పోస్తూ ఉంటారు. ఇలా మరుసటి రోజు ఉదయం వరకూ ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. దీపం బాగా ప్రకాశిస్తే ఆ ఏడు పంటలు బాగా పండుతాయని, వర్షాలు సకాలంలో కురుస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ వేడుకను చూసేందుకు రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
పురాతన రామాలయంలో
నీళ్లతో వెలుగుతున్న దీపం
ధర్మవరం మండలం ధర్మపురిలో వింత
శ్రీరామనవమి రోజున వేడుక
చూసేందుకు వేలాదిగా తరలివస్తున్న భక్తులు
దేదీప్యమానంగా వెలిగే దీపం
భారీగా భక్తులు తరలివస్తారు
రామస్వామి ఆలయంలో నీటితో దీపం వెలిగించడం, ప్రభలతో స్వామి వారిని ఊరేగించడం వంటి వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వేడుకల్లో పాల్గొని, మొక్కులు తీర్చుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. గ్రామస్తుల సహకారంతో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా చర్యలు తీసుకుంటారు.
– గోవర్ధనరాజు, ధర్మపురి గ్రామం
తరతరాల ఆచారమిది
మేము తరతరాలుగా రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి నాడు పూజలు నిర్వహిస్తున్నాం. ఆ రోజున ఉపవాసంతో ఉదయం నుంచి స్వామిని ధ్యానిస్తూ అర్ధరాత్రి నీటితో దీపాన్ని వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. నీరు పోయగానే దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంటుంది. ఇది పూర్తిగా స్వామి వారి మహిమగానే విశ్వసిస్తున్నాం.
– రాఘవరాజు, ధర్మపురి గ్రామం


