కదిరి అర్బన్: గోల్‌షాట్ పోటీల్లో కదిరి ప్రాంత విద్యార్థి కొత్తపల్లి శైలజ సత్తా చాటింది. ఏప్రిల్ 24 నుంచి 29వ తేదీ వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగే సౌత్ ఏషియా కప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికై ంది.
అంచెలంచెలుగా ఎదుగుతూ...
కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి కె. ప్రసన్నకుమార్, చంద్రకళావతి దంపతుల కుమార్తె కొత్తపల్లి శైలజ గోల్‌షాట్ బాల్ పోటీల్లో సత్తా చాటుతోంది. తండ్రి ప్రసన్నకుమార్ కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లి హరీష్ పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్నారు. తల్లి గృహిణి. శైలజ ఇదే పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. శైలజ చిన్నప్పటి నుంచే క్రీడలపై మక్కువ పెంచుకుంది. తండ్రి పీఈటీ కావడం...హ్యాండ్‌బాల్ కోచ్ కావడంతో ఆయన వెంటే ఎక్కువగా మైదానంలో గడిపేది. ఈ క్రమంలో తొలుత హ్యాండ్ బాల్ ఎక్కువగా ఆడేది. తండ్రి ప్రసన్నకుమార్ కోచింగ్‌తో ఆ క్రీడలో రాటుదేలింది. ఈ క్రమంలో 2023లో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్–14 విభాగంలో హ్యాండ్‌బాల్ పోటీల్లో అనంతపురం జిల్లా జట్టు తరఫున పాల్గొంది. ఆ తర్వాత 2024లో స్కూల్ గేమ్స్ అండర్ –14 విభాగంలో పాల్గొన్న శైలజ తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికై ంది. చత్తీస్‌ఘడ్‌లో జరిగిన జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో మన రాష్ట్రం తరపున పాల్గొని సత్తా చాటింది.
ఆట మార్చి.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగి
హ్యాండ్‌బాల్ క్రీడలో జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన శైలజ.. ఉన్నట్టుండి గోల్‌షాట్ బాల్‌ను ఎంచుకుంది. నిరంతరం సాధన చేస్తూ గోల్‌షాట్ బాల్ క్రీడలో తిరుగులేని క్రీడాకారిణిగా పేరుగాంచింది. గోల్‌షాట్‌బాల్‌లోనూ అంచెలంచెలుగా ఎదుగుతూ జూనియర్ విభాగంలో జాతీయ స్థాయికి ఎదిగింది. గత నవంబర్‌లో బీహార్ రాష్ట్రంలో జరిగిన పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిథ్యం వహించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన 3వ సబ్ జూనియర్ బాలురు, బాలికలు జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు నుంచి ప్రాతినిథ్యం వహించిన శైలజ అత్యుత్తమ ప్రతిభ కనబరచింది. దీంతో సెలక్టర్లు ఆమెను సౌత్ ఏషియా కప్‌లో పాల్గొనే గోల్‌షాట్ బాల్ భారత జట్టుకు ఎంపిక చేశారు.
సత్తా చాటుతున్న కదిరి విద్యార్థిని
భారత జట్టుకు ఎంపిక
సౌత్ ఏషియా కప్ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం
ఆనందంగా ఉంది
ఏదైనా క్రీడలో భారత్ జట్టు తరఫున ఆడాలనేది నా కల. గోల్‌షాట్ బాల్ రూపంలో అది నెరవేరబోతోంది. మా నాన్నను చూసే క్రీడల్లోకి అడుగుపెట్టా. తొలుత హ్యాండ్‌బాల్ ఆడినా ఆ తర్వాత గోల్‌షాట్ బాల్ నచ్చి అందులోకి మారాను. సౌత్ ఆసియా కప్‌లోనూ తప్పక సత్తా చాటుతూ. చదువులోనూ రాణించి ఐపీఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. – కొత్తపల్లి శైలజ, గోల్‌షాట్ బాల్ ప్లేయర్


