హిందూపురం: పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తీని తీర్చేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ జి. వెంకటేశు, డీటీ మైనుద్దీన్, పాల్గొన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ
‘స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే అధిక జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే సదరు వ్యాపారాల లైసెన్సులు రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సైకిల్ ర్యాలీ చేపట్టి చైతన్య పరిచారు.
నాణ్యమైన భోజనం ఇవ్వాలి.
హిందూపురంలోని చిన్న మార్కెట్‌లో ఉన్న అన్నా క్యాంటిన్‌ను కలెక్టర్ పరిశీలించి, భోజనం రుచి చూశారు. భోజనంలో నాణ్యత లోపించరాదని, ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అట్రాసిటీ కేసుల్లో బాధితులకు
ఉద్యోగ అవకాశం
ప్రశాంతి నిలయం: అట్రాసిటీ కేసుల్లో బాధిత కుటుంబాల్లోని అర్హులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమావేశం శనివారం కలెక్టరేట్‌లో జరిగింది. ఎస్పీ సతీష్‌కుమార్, ఆర్టీఓ కరుణ సాగర్‌రెడ్డి, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. దీనిపై త్వరలో స్పష్టమైన ప్రకటన జారీ చేస్తామన్నారు. అంబేడ్కర్ భవన నిర్మాణానికి సంబంధించి సాంఘిక సంక్షేమశాఖకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. అలాగే పౌర హక్కుల దినోత్సవాన్ని ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ హక్కులపై ప్రజలను చైతన్య పరచాలని ఆర్డీఓలను ఆదేశించారు.
కలెక్టర్ శ్యాం ప్రసాద్


