ఐపీఎల్‌తో ఊరూరా క్రికెట్ హీట్ పెరుగుతోంది. రెండు నెలల పాటు సాగే ఐపీఎల్‌తో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకోనుండగా.. బెట్టింగ్ రాయుళ్లు అదే స్థాయిలో బరిలోకి దిగుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్‌ను గ్రామస్థాయికి తీసుకొచ్చారు. యువతకు గాలం వేసి మరీ ముగ్గులోకి దింపి వారి జేబులు గుల్ల చేస్తున్నారు.
పుట్టపర్తి టౌన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ –2026 (ఐపీఎల్ ) 19వ సీజన్ మొదలైంది. ఉత్కంఠంగా సాగే ఈ మ్యాచ్‌లు అభిమానులు ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఈ సీజన్‌లో 10 జట్లు పాల్గొంటుండగా, 74 మ్యాచ్‌లు రెండు నెలల పాటు జరగనున్నాయి. దీంతో అభిమానుల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవడానికి బుకీలు రంగంలోకి దిగారు. ‘‘మీ ఫెవరెట్ టీం గెలుస్తుందా... నిజంగా మీ టీంపై అభిమానం ఉంటే బెట్టింగ్ కట్టవచ్చుకదా... సరదాగా డబ్బులు గెలుచుకోవచ్చు’’ అంటూ యువతను ముగ్గులోకి దించుతున్నారు.
బహిరంగమే..
ఆన్‌లైన్‌లో సాగే బెట్టింగ్.. అంతా బహిరంగంగానే సాగుతోంది. క్రికెట్ బెట్టింగ్ కోసమే వివిధ యాప్‌లు పుట్టుకురాగా, జిల్లాలోని హిందూపురం, కదిరి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర తదితర పట్టణాలకే కాకుండా మండల కేంద్రాలు, చివరకు గ్రామాలకూ బెట్టింగ్ హీట్ తాకుతోంది. బెట్టింగ్ నిర్వహించే వారు..బెట్ వేసే వారు ఫోన్‌లోనే కాంటాక్ట్ చేసి పందేలు కాస్తున్నారు. గెలుపొందిన వారినుంచి కమీషన్లు పొందేలా ఏర్పాట్లు చేయిస్తున్నారు. పట్టణాల్లో, పల్లెల్లో యవకులను టార్గెట్ చేస్తున్నారు.
అంతా ఆన్‌లైనే..
సెల్ ఫోన్ ద్వారానే క్రికెట్ బెట్టింగ్ ఆడేవారు. కొన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకొని మ్యాచ్‌లు ప్రత్యక్షంగా పరిశీలిస్తూ పందేలు కాయడం, మ్యాచ్ చూసేందుకు ఒకటి బెట్టింగ్ ఆడేందుకు మరొక మొబైల్ వినియోగిస్తారు. ఆన్‌లైన్‌లో క్రికెట్ బుకీలతో సంప్రదింపులు జరుపుతూ కమీషన్లు పొందుతారు.
కోడ్ లాంగ్వేజ్..
బెట్టింగ్ వ్యవహారం అంతా కోడ్ లాంగ్వేజ్ ద్వారా సాగేలా ఏర్పాటు చేసుకున్నారు. సెల్ ఫోన్‌తోనే ఎస్... నో... ఓకే... డన్... వంటి పదాలు వాడుతున్నారు. చాలా మంది యువత మ్యాచ్‌లు జరిగే సమయంలో బెట్టింగ్ ఆడేందుకు తమకు అనువైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు... ఎవరు ఓడిపోతారు... ఎవరెన్ని పరుగులు చేస్తారు... ఈ ఓవర్‌లో బ్యాటర్లు ఎన్ని పరుగులు చేస్తారు...అనే వాటిపై పందేలు కాస్తున్నారు. కానీ జిల్లాలో చాలా మంది సెల్‌ఫోన్, టీవీల ద్వారా మ్యాచ్ చూస్తూ పందేలు కాస్తున్నారు. అయితే టీవీల్లో మ్యాచ్ చూసే వారికి కనీసం 10 నుంచి 20 సెకండ్ల తేడాతో లైవ్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి రెండు మూడు బంతులు సమయం తేడా ఉంటుంది. అది తెలుసుకోకుండా బెట్టింగ్ ఆడేవారి జేబులకు చిల్లులు పడుతున్నాయి.
ప్రతిదానికి ఒక రేటు..
టాస్ నుంచే బెట్టింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారు...ఏ బౌలర్ మొదటి ఓవర్ వేస్తారు...ఓ బ్యాటర్ ఎన్ని పరుగులు తీస్తారు. ఫలానా ఓవర్‌లో ఎన్ని వికెట్లు పడతాయి... ఎవరు గెలుస్తారు... ఎన్ని పరుగులతో మ్యాచ్ పూర్తవుతుంది....ఇలా ప్రతి దానికీ బెట్టింగ్ ఉంటుంది. ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. జస్ట్ రూ.100 బెట్టింగ్ కాస్తే రూ.1,000పైనే అంటూ ఊరిస్తుండటంతో యువత బెట్టింగ్ వలలో చిక్కుకుపోతున్నారు. ఇలా జిల్లాలోని చాలా మంది యువకులు బెట్టింగ్‌లో ఓడి అప్పులు పాలైన సంఘటనలు గతంలో వెలుగుచూశాయి. మరికొందరు పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయి అవి తీర్చలేక అఘాయిత్యాలకూ పాల్పడిన ఉదంతాలు జిల్లా వాసులందరికీ తెలిసినవే. అందువల్ల బెట్టింగ్ జోలికి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మొదలైన ఐపీఎల్ సందడి
అభిమానుల ఆసక్తిపై
బుకీలు వల
బెట్టింగ్‌లోకి దింపి గుల్ల చేస్తున్న వైనం
ఊరూరా ఐపీఎల్ సందడి..
పట్టణాలు, గ్రామాల్లో ఐపీఎల్ బెట్టింగుల జోరు కనిపిస్తోంది. ప్రధానంగా ఏయే తేదీల్లో ఎవరెవరి మధ్య మ్యాచ్ జరుగుతుందో తెలుస్తుండంతో బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, ముంబై టీంల మధ్య ఎక్కుగా బెట్టింగులు కాసేందుకు సిద్ధమయ్యారు. దీంతో బుకీలు కూడా ఆయా మ్యాచ్‌లపై ప్రత్యేక దృష్టి సారించి క్రీడాభిమానులను ఊరిస్తూ వారి డబ్బులు కాజేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని హిందూపురం, ధర్మవరం, కదిరి, పెనుకొండ, పుట్టపర్తి పట్టణాల్లో కాకుండా మండల కేంద్రాల్లో యువత పోగై తనకు అనువైన ప్రదేశాలు ఎంచుకుని అక్కడకు చేరుకొని నేరుగా బెట్టింగ్‌లోకి దిగుతున్నారు.


