ఓడచెరువు(అమడగూరు): అమడగూరు ఎంపీపీ ప్రసాద్‌రెడ్డిపై ఎంపీటీసీల అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ ఓటింగ్ నివేదికను సీల్డ్‌కవర్‌లో కోర్టుకు పంపారు.
పార్టీ ఫిరాయింపుతో అవిశ్వాసం..
అమడగూరు మండల పరిషత్‌లో 8 ఎంపీటీసీ స్థానాలుండగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటినీ వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. అనంతరం ఆ పార్టీ నిర్ణయం మేరకు కొట్టువారిపల్లి ఎంపీటీసీ సభ్యుడు ప్రసాద్‌రెడ్డి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంపీపీ ప్రసాద్ రెడ్డి టీడీపీ పంచన చేరాడు. దీంతో మిగతా ఎంపీటీసీలు అతనిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానం నోటీసును స్థానిక అధికారులకు తీసుకోలేదు. దీంతో ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించగా... అమడగూరు ఎంపీపీపై సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 28న ఓటింగ్ నిర్వహించాలని, ఫలితాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదించాలని ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల అధికారిగా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణను నియమించింది. దీంతో శనివారం ఆర్డీఓ సువర్ణ ఎంపీపీపై సభ్యులిచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఓటింగ్‌కు జయమ్మ (జేకే పల్లి), గంగులమ్మ (చినగానిపల్లి), కళావతి (గుండువారిపల్లి), వెంకటలక్ష్మమ్మ (మహమ్మదాబాద్), శకుంతల (పూలకుంటపల్లి), వెంకటరమణ (అమడగూరు) హాజరు కాగా, లక్ష్మీపతి (తుమ్మల), ఎంపీపీ ప్రసాద్ రెడ్డి గైర్హాజరయ్యారు.
సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు పంపాం
హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం అమడగూరు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రక్రియ నిర్వహించాం. ఆరుగురు ఎంపీటీసీలు హాజరై ఓటు వేశారు. నివేదికను హైకోర్టుకు పంపుతున్నాం. కోర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. – సువర్ణ, ఆర్డీఓ, పుట్టపర్తి
ఓటింగ్‌లో పాల్గొన్న ఆరుగురు ఎంపీటీసీలు
నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు పంపిన ఆర్డీఓ


