హిందూపురం: స్థానిక మున్సిపాల్టీ పరిధిలోని ఆదాయ వనరులపై బుధవారం నిర్వహించిన వేలం ప్రక్రియ టీడీపీ నేతల జోక్యంతో పక్కదారి పట్టింది. అధికార పార్టీకి చెందిన నాయకులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకే టెండర్లు దక్కించుకున్నారు. దీంతో గత ఏడాదితో పోల్చుకుంటే మున్సిపాల్టీకి రూ.15.76 లక్షల ఆదాయం తగ్గింది. ఏటా ఆదాయ వనరులపై 30 శాతం పెంచుతూ వేలం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ సారి టీడీపీ నేతల ఒత్తిళ్లు తాళలేక అధికారులు తక్కువ మొత్తానికే టెండర్లు ఖరారు చేయడం గమనార్హం.
తూతూమంత్రంగా వేలం ప్రక్రియ
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సమక్షంలో బుధవారం పెద్ద కూరగాయల మార్కెట్, చిన్న పశువుల మార్కెట్, పెద్ద పశువుల మార్కెట్, పరిగి బస్టాండ్‌లోని ఖాళీ స్థలాలపై సుంకం వసూళ్లకు వేలం నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు కుమ్మకై తక్కువ ధరకే టెండర్లు కై వసం చేసుకున్నారు. కూరగాయల మార్కెట్ వేలం రూ. 50.25 లక్షలకే ఖరారైంది. చిన్న పశువుల మార్కెట్ రూ. 7.36 లక్షలు, పెద్ద పశువుల మార్కెట్ రూ.1.18 లక్షలు, పరిగి బస్టాండ్‌లో ఖాళీ స్థలం రూ. 20.02 లక్షలతో వేలం దక్కించుకున్నారు. ఈ నాలుగు మార్కెట్ల ద్వారా కేవలం రూ.78.81 లక్షల ఆదాయం మాత్రమే సమకూరింది. అలాగే ఇందిరాపార్క్‌లోని వాణిజ్య సముదాయాల్లో ఉన్న 26వ నంబర్ గదికి రూ.7 వేల అద్దె చెల్లించేలా టెండర్ దక్కించుకున్నారు. మున్సిపల్ లైబ్రరీ కాంపెక్స్, మున్సిపల్ బస్టాండ్‌లోని ఐదు వాణిజ్య దుకాణాల వేలం ప్రక్రియ వాయిదా పడింది. ఈ ప్రక్రియ మొత్తం తూతూమంత్రంగా అధికారులు నిర్వహించారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రజలపై భారం పడకూడదంటూ బుకాయింపు
గత ఏడాది మున్సిపాల్టీ ఆదాయ వనరులపై నిర్వహించిన వేలం ప్రక్రియలో రూ.94.57 లక్షల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఏకంగా రూ.15.76 లక్షల ఆదాయం తగ్గి రూ.78.81 లక్షలకు చేరుకుంది. ఈ వ్యత్యాసంపై కమిషనర్ మల్లికార్జున మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకే వేలం పాటదారులకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ దారులు పోటీ పడి హెచ్చు ధరకు వేలం పాడితే ఆ మొత్తాన్ని సమీకరించుకునేందుకు వ్యాపారులు, ప్రజలపై భారం వేస్తారని, అలా ప్రజలపై భారం పడకూడదనే టెండర్లు ఖరారు చేసినట్లు వివరించారు. నిర్ణీత ధర కంటే ఎక్కువ సుంకం వసూలు చేస్తే కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గత ఏడాదితో పోల్చుకుంటే తగ్గిన రూ.15.76 లక్షల ఆదాయం
టీడీపీ నేతల జోక్యంతో పక్కదారి పట్టిన వేలం ప్రక్రియ


