ప్రశాంతి నిలయం: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్)లో భాగంగా నిధులు అందజేసి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలని జిల్లాలోని పరిశ్రమల నిర్వాహకులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. సీఎస్‌ఆర్ నిధుల సమీకరణ అంశంపై బుధవారం కలెక్టరేట్‌లో వివిధ పరిశ్రమల మేనేజర్లు, కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. తాగునీటి సమస్య, చెత్త సేకరణ ప్రక్రియ, రైతు బజార్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లకు ప్రహరీ నిర్మాణాలు, అంగన్‌వాడీ స్కూళ్ల నిర్మాణానికి సహకరించాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, పరిశ్రమల జీఎం నాగరాజు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీఎస్‌డీఓ హరికృష్ణ పాల్గొన్నారు.
ఎంఎన్‌ఓ ఆత్మహత్యాయత్నం
అనంతపురం: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో కాంట్రాక్ట్ పద్దతిలో ఎంఎన్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న యువకుడు మధుకుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటుకలపల్లి పరిసర ప్రాంతాల్లో బుధవారం కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగాడు. ధర్మవరం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోక మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీంతో మనస్తాపం చెందిన మధుకుమార్ ఆత్మహత్యయత్నానికి పాల్బడ్డాడు. ప్రస్తుతం సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న మధుకుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
గవి మఠం హుండీ లెక్కింపు
ఉరవకొండ: గవిమఠం చంద్ర మౌళీశ్వరస్వామి శాశ్వత హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. మఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, మఠం ఇన్‌చార్జ్ సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షించారు. శాశ్వత హుండీ ద్వారా రూ 2.9లక్షలు వసూలైంది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ 2025లో శాశ్వత హుండీ ద్వారా 1,78,175 ఆదాయం రాగా, ప్రస్తుతం అదనంగా రూ30,949 ఆదాయం వచ్చిందన్నారు. లెక్కింపులో మఠం జూనియర్ అసిస్టెంట్ గోపి, మధు తదితరులు పాల్గొన్నారు.


