కనగానపల్లి: మండలంలోని తల్లిమడుగుల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుని కిరాణా దుకాణం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన మేరకు... గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఫకృద్దీన్ (మూగ), నసీమా దంపతులు కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నిత్యావసర సరుకులతో పాటు స్నాక్స్, కూల్ డ్రింక్స్, టీ విక్రయిస్తుంటారు. మంగళవారం రాత్రి దుకాణాన్ని బంద్ చేసి ఇంటికెళ్లి నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పేశారు. అప్పటికే నిత్యావసర సరుకులు, విద్యుత్ సామగ్రి కాలిబూడిదయ్యాయి. రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.
మామిడి సాగుపై అవగాహన పెంచుకోవాలి
● ఉద్యాన అధికారి చంద్రశేఖర్
పుట్టపర్తి అర్బన్: మారుతున్న కాలానికి అనుగుణంగా మామిడి ఆధునిక సాగు విధానాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రైతులకు జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సెర్ప్ డీపీఎం రామమోహన్ సూచించారు. బుక్కపట్నం మండలం రాసింపల్లిలో మామిడి రైతులకు బుధవారం సీస్కో ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ గ్రీన్ ట్రస్ట్, ఉద్యాన శాఖ, సెర్ప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. అధిక సాంద్రత సాగు విధానాలు, కీటకాలు, వ్యాధుల నివారణ, నీటి ఆదా, సేంద్రియ ఎరువులు, సమగ్ర పోషకాల నిర్వహణ, మామిడిని ఆశించే కీటకాలు, ప్రతికూల పరిస్థితుల నుంచి పంటను రక్షించుకునే విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బుక్కపట్నం, ముదిగుబ్బ, నల్లమాడ, కదిరి, తలుపుల, ఓడీచెరువు, పుట్టపర్తి, కొత్తచెరువు మండలాల రైతులు, ఉద్యానశాఖ అధికారి నవీన్‌కుమార్, డిజిటల్ గ్రీన్ డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి
● డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజశేఖర్
హిందూపురం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ద్వారా అందజేస్తున్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రిమాండ్ ఖైదీలకు ఆ సంస్థ కార్యదర్శి రాజశేఖర్ సూచించారు. బుధవారం హిందూపురంలోని సబ్‌జైలును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఖైదీల బ్యారెక్‌లు, వంట గదితో పాటు రికార్డులు పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. తప్పులు చేసి జైలుకు వచ్చిన నిందితులకు ఆర్థిక ఇబ్బందులుంటే దరఖాస్తు చేసుకుంటే అర్హత ఉన్న వారికి ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేసి కేసులు వాదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జైలులో కులవివక్ష ప్రదర్శిస్తుంటే వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో సబ్‌జైలు అధికారి హనుమప్ప, న్యాయవాదులు నవేరా, దివ్య, శివ తదితరులు పాల్గొన్నారు.


