అనంతపురం: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఓ మహిళకు పునర్జన్మను ప్రసాదించారు. వివరాలను బుధవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి వెల్లడించారు. పెనుకొండ మండలం బక్సంపల్లి గ్రామానికి చెందిన అనిత మూడో కాన్పు నిమిత్తం జీజీహెచ్‌లో చేరింది. గతంలో రెండు కాన్సులు సిజేరియన్ అయ్యాయి. మూడో కాన్పు కూడా సిజేరియన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు నిర్ధారించారు. అయితే గర్భిణి అనిత మెదడుకు వెళ్లే రెండు రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్టీఎల్, కెరటిక్ పద్ధతుల్లో శస్త్ర చికిత్స చేసి, అనిత ప్రాణాలు కాపాడారు. అయితే పురిటిలోనే నవజాత శిశువు మృతి చెందింది. ప్రస్తుతం అనిత కోలుకోవడంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరుదైన శస్త్రచికిత్సతో రోగి ప్రాణాలు కాపాడిన గైనకాలజిస్ట్ హెచ్‌ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం, డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ అరుణ జ్యోతి, డాక్టర్ సౌజన్య, అనస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్ నవీన్‌కుమార్, డాక్టర్ జగదీష్, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ సాహితీ బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి అభినందించారు.


