ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పారిశ్రామిక అనుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వివిధ శాఖల ద్వారా పరిశ్రమలకు రావాల్సిన అనుమతులను వెంటనే మంజూరు చేయాలన్నారు. గత ఏడాది విశాఖ పట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు జిల్లాలో ఏర్పాటవుతున్న పరిశ్రమలపై, పీఎం విశ్వకర్మ పథకాల పురోగతిని సమీక్షించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూ కేటాయింపులు, ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీలో భాగంగా వ్యర్థ పదార్థాలతో నూతన ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. అనంతరం పారిశ్రామిక పాలసీ ద్వారా దరఖాస్తు చేసుకున్న 15 పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడి, వడ్డీ రాయితీ మంజూరు చేశారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం రమణయ్య, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ నాగరాజు, శ్రీకాంతమ్మ, డీపీఓ సత్యనారాయణ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎంల భద్రతకు అధిక ప్రాధాన్యం
ధర్మవరం అర్బన్: ఈవీఎంల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం ఈవీఎం గోడౌన్‌లపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. గోడౌన్ వద్ద సీసీ కెమెరా వ్యవస్థ, ఫైర్ సేఫ్టీ, నిరంతర భద్రతా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జ్ ఆర్డీఓ సూర్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, తహసీల్దార్ సురేష్‌బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.


