పరిహారం ఇవ్వలేదని రోడ్డుకు అడ్డంగా ముళ్లకంప
● రైతుల వినూత్న నిరసన
ముదిగుబ్బ: రోడ్డు నిర్మాణానికి భూమి తీసుకున్న ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందంటూ ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన రైతు ఓబిలేసుతో పాటు మరికొందరు వినూత్న నిరసన తెలిపారు. బుధవారం వారు ముదిగుబ్బ– పుట్టపర్తి రహదారికి అడ్డంగా ముళ్లకంప వేసి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. బాధిత రైతుల కథనం మేరకు... ముదిగుబ్బ – పుట్టపర్తి రహదారి నిర్మాణంలో భాగంగా ముదిగుబ్బకు చెందిన ఓబిలేసుతో పాటు మరికొందరు రైతులు భూమి కోల్పోయారు. రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తయినా వారికి మాత్రం పరిహారం అందలేదు. అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు మిగిలి ఉన్న భూమిలోకి వెళ్లినా అధికారులు అడ్డుకుంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు బుధవారం రహదారికి అడ్డంగా ముళ్లకంపలు వేసి నిరసన తెలిపారు. దీనివల్ల వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడడంతో పోలీసులు రంగంలోకి దిగి..ముళ్లకంపలు తొలగించారు. పోలీసులు ఒకానొక దశలో రైతులపై కేసులు నమోదు చేయాలని చూశారు. చివరకు నోటీసులతో సరిపెట్టారు. తమ సమస్య ఉన్నతాధికారులకు తెలుస్తుందని భావించి ఈవిధంగా నిరసన తెలిపినట్లు రైతులు చెప్పారు.


