‘వెన్ను’దన్నుగా నిలిచిన డాక్టర్లు | - | Sakshi
Sakshi News home page

‘వెన్ను’దన్నుగా నిలిచిన డాక్టర్లు

Feb 26 2026 7:23 AM | Updated on Feb 26 2026 7:23 AM

‘వెన్ను’దన్నుగా నిలిచిన డాక్టర్లు

‘వెన్ను’దన్నుగా నిలిచిన డాక్టర్లు

అనంతపురం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన వ్యక్తికి అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో పునర్జన్మను ప్రసాదించారు. ఈ క్రమంలో ఆర్థో విభాగం వైద్యులు డాక్టర్‌ ఆత్మారాం, డాక్టర్‌ సతీష్‌, డాక్టర్‌ మహమ్మద్‌ గౌస్‌ కృషిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే... శెట్టూరు మండలం బసంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశులు ఈ నెల 6న ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముక దెబ్బతిని కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 7న అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. పరీక్షించిన వైద్యులు స్పైనల్‌ డీకంప్రెషన్‌ అయిందని, శస్త్రచికిత్సతో నయమయ్యే అవకాశాలు ఉన్నాయని నిర్ధారించారు. ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపి వారి ఆమోదంతో జీజీహెచ్‌లోని ఆర్థో విభాగానికి చెందిన డాక్టర్‌ ఆత్మారాం, డాక్టర్‌ సతీష్‌, డాక్టర్‌ మహమ్మద్‌ గౌస్‌తో పాటు డాక్టర్‌ యువరాజ్‌ నేతృత్వంలో ఈ నెల 9న అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ప్రైవేట్‌గా ఈ చికిత్స చేయించుకోవాలంటే రూ.7 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ప్రభుత్వాస్పత్రిలో పూర్తి ఉచితంగా వైద్యాన్ని అందించారు. రోగి కోలుకుని వాకర్‌ సాయంతో నడుస్తుండడంతో బుధవారం డిశ్చార్జ్‌ చేశారు. మరి కొన్ని రోజులు వాకర్‌ సాయంతోనే నడవాల్సి ఉంటుందని, ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుని ఎవరి సాయం లేకుండా నడిచేందుకు అవకాశం ఉంటుందని వైద్యుల బృందం తెలిపింది. అరుదైన చికిత్సతో పునర్జన్మను ప్రసాదించిన వైద్యులకు వెంకటేశులుతో పాటు కుటుంబసభ్యులూ కృతజ్ఞతలు తెలిపారు.

కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న వ్యక్తికి నడిచే రీతిలో అరుదైన శస్త్రచికిత్స

రూ.7 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందజేసిన జీజీహెచ్‌ వైద్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement