టీచర్లతో సర్కార్ బంతాట
అనంతపురం ఎడ్యుకేషన్: మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. సొంత మండలాలు, సమీప ప్రాంత పాఠశాలల్లో పనిచేస్తున్న వీరిని బలవంతంగా సుదూర ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో సదరు ఉపాధ్యాయులు విధులకు వెళ్లి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. వారి ప్రాణాలకు రక్షణ లేకుండాపోతోంది. ఊహించని ప్రమాదాలతో కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.
డీఎస్సీ–1998, 2008 క్వాలిఫైడ్ అభ్యర్థులు న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూశారు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా వీరి జీవితాలు మారలేదు. పాదయాత్రలో తనను కలిసిన క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎంటీఎస్ టీచర్లుగా తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఎంతమంది ప్రజాప్రతినిధులు, నాయకుల వద్దకు వెళ్లినా తమ గోడు పట్టించుకోలేదని, అలాంటిది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత తమ జీవితాల్లో వెలుగులు నింపారని ఆనందపడ్డారు. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు 470 మంది, డీఎస్సీ–2008 అభ్యర్థులు 190 మందికి ఎంటీఎస్ టీచర్లుగా అవకాశం వచ్చింది.
ఎంటీఎస్ టీచర్లకు రూ.32 వేలు వేతనం నిర్ణయించారు. జీతాలు తక్కువగా ఉన్న కారణంగా వీరిని వీలైనంత వరకు వారి సొంతమండలం, లేదా పక్క మండలాల్లోనే ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం గత ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వు జారీ చేసింది. ఇంటికి అందుబాటులో ఉన్న స్కూళ్లు కావడంతో వారుకూడా ఆనందంగా విధులు నిర్వహించారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జూన్‌లో బదిలీలు జరిగాయి. సాధారణ టీచర్లతో పాటు ఎంటీఎస్ టీచర్లనూ బదిలీ చేశారు. అయితే వీరి బదిలీలు ఎలా ఉన్నాయంటే 85 శాతం మందికి పైగా టీచర్లందరినీ సరిహద్దు మండలాలకు కేటాయించారు. వీరిపట్ల కనీస దయ చూపకుండా కక్షకట్టినట్లు వ్యవహరించారు. అంతకుముందు వీరు పని చేస్తున్న స్థానాలన్నీ ఖాళీలుగా చూపించగా, ఇప్పుడు మాత్రం ప్రతి మండలంలోనూ అరకొరగా 1–2 మాత్రమే వీరికి చూపించారు. రెగ్యులర్ టీచర్ల బదిలీలు పూర్తయిన తర్వాత ఏర్పడిన ఖాళీలకు మాత్రమే వీరిని బదిలీ చేశారు.
వేడుకున్నా.. వేదనే మిగిలింది
తక్కువ జీతాలు రావడం, ముఖ్యంగా 1998 డీఎస్సీ అభ్యర్థులు దాదాపు రిటైర్డ్ వయసులో ఉన్నామని కుటుంబాలను వదిలి అంతదూరం వెళ్లలేమని గగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. అలాగని కుటుంబాలను బదిలీ అయిన చోట పెట్టాలంటే ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని వేడుకున్నా ప్రభుత్వం వినలేదని ఎంటీఎస్ టీచర్లు వాపోతున్నారు. ఈక్రమంలో ఆరోగ్యం సహకరించక కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మరికొందరు రవాణాకు నెలకు రూ.10 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఇంకొందరు వయసు మీదపడినా ఒంటరిగానే బదిలీ పాఠశాలల దగ్గర్లో గదులు తీసుకుని ఉంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమపట్ల దయ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంటీఎస్ టీచర్లను బలవంతంగా
దూర ప్రాంతాలకు బదిలీ
చాలీచాలని జీతాలని గగ్గోలు పెట్టినా.. పట్టించుకోని సర్కార్
విధులకు బైకుల్లో వెళ్తూ ప్రమాదాల బారినపడుతున్న టీచర్లు
మరోమారు తెరపైకి ఎంటీఎస్ టీచర్ల బదిలీల వ్యవహారం
ఇక్కడ విగజీవిగా కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆదినారాయణ. ఎంటీఎస్ టీచరుగా పని చేస్తున్నారు. సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి కాగా గత ఏడాది జూన్‌లో జరిగిన బదిలీల్లో గుడిబండ మండలం మోపురుగుండు స్కూల్‌కు వెళ్లారు. ఈయనతో పాటు గుడిబండ మండలం దిన్నెహట్టి స్కూల్‌లో పని చేస్తున్న ఎంటీఎస్ టీచరు తుమ్మలప్ప (అమడగూరు మండలానికి చెందిన) ఇద్దరూ మంగళవారం బైకులో వెళ్తుండగా పరిగి మండలం ధనాపురం క్రాస్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదినారాయణ సంఘటన స్థలంలోనే మృతి చెందగా తుమ్మలప్పకు కాలు విరిగింది. వీరి సొంత మండలాల నుంచి దాదాపు 140 కిలోమీటర్ల దూరానికి బదిలీ చేయడంతో ప్రాణాలమీదకు వచ్చింది.
నాడు సమీపంలోనే విధులు..
వెలుగులు నింపిన జగన్ ప్రభుత్వం
నేడు కక్ష కట్టి.. దూరానికి నెట్టి..
టీచర్లతో సర్కార్ బంతాట


