మ్యుటేషన్ పక్కాగా జరగాలి
● అధికారులను ఆదేశించిన
జేసీ మౌర్య భరద్వాజ్
హిందూపురం: అడంగల్‌లో భూ యజమాని పేరు మార్పు కోసం చేసే మ్యుటేషన్ ప్రక్రియను పక్కాగా చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన హిందూపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వెబ్‌ల్యాండ్ అడంగల్‌లో క్లెయిమ్ చేయని భూములు, ఇతరుల పేరిట నమోదైన మిగులు భూముల రికార్డులను పరిశీలించారు. అలాగే 12, 13 కాలమ్స్‌లో నమోదు చేసిన భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భూములకు సంబంధించి గ్రామసభలు నిర్వహించి రైతుల నుంచి భూమికి సంబంధించిన పత్రాలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సదరు రైతు అనుభవంలో ఉన్నట్లు ఆధారం చూపితే...పక్క పొలం రైతుల నుంచి కూడా స్టేట్‌మెంట్ తీసుకోవాలన్నారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హులైన వారికి మ్యుటేషన్ ప్రక్రియ ఉచితంగా పూర్తి చేస్తామన్నారు. అనంతరం జేసీ మౌర్య భరద్వాజ్.. తప్పుల్లేని ఓటర్ జాబితా తయారీ కోసం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశు, డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్, హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, సర్వేయర్ సురేష్‌కుమార్, వీఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
పప్పుశనగ మద్దతు ధర ప్రకటన
పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వం పప్పుశనగకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించిందని ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ గీతమ్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పప్పుశనగకు ఈ–క్రాప్ చేయించిన రైతుల నుంచి మాత్రమే సరుకు కొంటామన్నారు. మార్చి మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా పప్పుశనగ కొనుగోళ్లు చేపడతామన్నారు. రైతులు ముందుగా సంబంధిత ఆర్‌ఎస్‌కేల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఎస్కేయూలో పైసా వసూల్
● జీతం పెంచుతామని రూ.10వేలు
చొప్పున ఉద్యోగులతో కలెక్షన్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చిరుద్యోగులకు జీతాలు పెంచుతామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ మినిమం స్కేలు ఉద్యోగులు 220 మంది మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. నామమాత్రపు జీతంతో చేరిన వీరికి ప్రస్తుతం రూ.15,850 ఇస్తున్నారు. వీరు జీతాలు పెంచాలని యూనివర్సిటీ యాజమాన్యానికి ఎన్నోసార్లు విన్నవిస్తూ వచ్చారు. గత వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి హయాంలో జీతం రూ.4 వేలు పెంచాలని నిర్ణయించారు. అయితే అప్పటి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇందుకు నిరాకరించారు. దీంతో ఆ అంశం మరుగునపడింది. తాజాగా రూ.5 వేల చొప్పున జీతం పెంపుదల చేస్తామంటూ మినిమం స్కేల్ ఉద్యోగుల్లో కొందరు దళారీ అవతారమెత్తారు. అమరావతి సెక్రెటేరియట్‌లో ఉన్నత విద్య విభాగం నుంచి జీఓ తీసుకు రావడానికి డబ్బు ఖర్చు అవుతుందంటూ.. ఇందుకు గాను ఒక్కొక్కరు రూ.10వేలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అలా అందరూ కలిసి ముందుకు వస్తేనే పెంపుదల సాధ్యమవుతుందని నమ్మబలికారు. ‘సార్’ (యూనివర్సిటీ కీలకాధికారి) చెప్పారు.. ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది అంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరైనా ఇవ్వకపోతే ఉద్యోగుల జాబితా నుంచి పేరు తీసివేయిస్తామని, పెరిగిన జీతం ఇచ్చేది ఉండదని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు ఐదారుగురు మినహా మిగిలిన అందరూ ఫోన్‌పే, నగదు రూపంలో మొత్తం రూ. 21.50 లక్షల దాకా చెల్లించారు. ఈ డబ్బు వసూలులో ముగ్గురు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారు. సెక్రటేరియట్‌లో జీఓ తేవడానికి డబ్బు వసూలు చేయాల్సిన అవసరం లేకున్నా.. ఇలా అనధికారికంగా వసూళ్లకు పాల్పడటం.. కీలకాధికారి పాత్ర ఉండటం వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.
మ్యుటేషన్ పక్కాగా జరగాలి


