మాతా, శిశు మరణాలు అరికట్టాలి
ప్రశాంతి నిలయం: మాతా, శిశు మరణాలను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ప్రతి గర్భిణిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు వైద్య సేవలతో పాటు పౌష్టికాహారం అందించగలిగితే మరణాలకు ఆస్కారమే ఉండదన్నారు. 2025 జూన్ నుంచి డిసెంబర్ వరకూ జిల్లాలో నమోదైన ఆరు మాతృ మరణాలపై బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని వీసీ హాలులో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజా బేగం మాతృ మరణాలకు దారి తీసిన కారణాలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ‘‘ప్రసవ సమయంలో ఏ తల్లీ మరణించకూడదు– ఏ శిశువు జనన సమయంలో మృత్యువాత పడకూడదు’’ అనే లక్ష్యంతో అధికారులు పని చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి మాతా శిశు మరణాలను తగ్గించాలన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమీక్షలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మధుసూదన్, డీఐఓ సురేష్‌బాబు, గైనకాలజిస్ట్ శశిరేఖ, పీడీయాట్రీషియన్ నజీర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు మంజువాణి, నాగేంద్ర నాయక్, సునీల్, చెన్నారెడ్డి, శ్రీదేవి, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గర్భిణులకు క్రమం తప్పకుండా
వైద్య పరీక్షలు నిర్వహించాలి
వైద్యఆరోగ్యశాఖ అధికారులకు
కలెక్టర్ ఆదేశం


