రాష్ట్రాన్ని అత్యాచారాల ప్రదేశ్‌గా మార్చారు
చిలమత్తూరు: రాష్ట్రంలో మహిళలకే కాదు..బాలికలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన అంత్యంత కిరాతకమన్నారు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు సర్కారు వైఫల్యమేనన్నారు. బాలికను అత్యాచారం చేసిన ఆ దుర్మార్గుడు అతి కిరాతకంగా చంపడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ ఉందా ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతోందన్నారు. అత్యాచార ఘటనల్లో నిందితులపై కఠినంగా వ్యవహరించకపోవడంతోనే దుండగులు కామంతో కళ్లు మూసుకుపోయి దుర్మార్గాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలను అత్యాచారాలు చేసి అతికిరాతకంగా చంపుతున్నారని, పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయిందన్నారు.
పురంలోనూ భయం భయం
హిందూపురం నియోజకవర్గంలోనూ అత్యాచారాలు ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయని టీఎన్ దీపిక అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక అత్యాచార ఘటనలకు అంతే లేకుండా పోయిందన్నారు. దుర్మార్గులు మహిళలను లైంగికంగా వేధించడం, ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. హిందూపురంలో టీడీపీ నాయకుడు యుగంధర్ చేసిన ఆకృత్యాలు, చిలమత్తూరులో టీడీపీ కార్యకర్త నాగేంద్ర చేసిన దారుణాలు హిందూపురం చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతాయన్నారు. ఇంత దుర్మార్గాలకు పాల్పడిన వ్యక్తులను టీడీపీ ప్రభుత్వం వెనకేసుకురావడం, వారితోనే మరిన్ని దుర్మార్గాలు చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ఇద్దరిపై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయలేదో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు, బాలికల భద్రత నియోజకవర్గంలో ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూపురం మద్యపురంగా మారిపోయిందని, మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటికై నా టీడీపీ ప్రభుత్వం దురాగతాలను పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని శాంతి భద్రతలు కాపాడాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు పాలనలో బాలికలు, మహిళలకు రక్షణ లేదు
సర్కారు వైఫల్యం వల్లే మదనపల్లె ఘటన
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపాటు


