బాంబులు పెట్టాం.. 12:05కు పేలుతాయ్
అనంతపురం/ఉరవకొండ/గుంతకల్లు/ధర్మవరం: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులతో పాటు ఉమ్మడి జిల్లాలోని కోర్టులకూ బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. అనంతపురం జిల్లా కోర్టుతో పాటు ఉరవకొండ, గుంతకల్లు, ధర్మవరం కోర్టులకు బుధవారం బెదిరింపుల ఈమెయిల్స్ అందాయి. ‘కోర్టు ఆవరణలో ఆర్డీఎక్స్ ఐఈడీలు అమర్చాం. అవి రిమోట్ కంట్రోల్ ద్వారా సరిగ్గా మధ్యాహ్నం 12:05 గంటలకు పేలుతాయ’ని ఈమెయిల్స్‌లో పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తులు, సిబ్బంది ముందు జాగ్రత్తగా కక్షిదారులను కోర్టుల నుంచి ఖాళీ చేయించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్‌లతో రంగంలోకి దిగిన పోలీసులు కోర్టు భవనాలతో పాటు ప్రాంగణాల్లో అణువణువూ తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. దీంతో ఇవన్నీ నకిలీ బెదిరింపులని పోలీసులు ప్రకటించారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రెస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత నెలలోనూ అనంతపురం కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. మళ్లీ అలాంటి బెదిరింపులే రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
బెదిరింపు ఈ– మెయిల్స్‌తో
కోర్టుల్లో కలకలం
పోలీసుల విస్తృత తనిఖీలు
ఉత్తుత్తి బెదిరింపులని నిర్ధారణ
బాంబులు పెట్టాం.. 12:05కు పేలుతాయ్


