ప్రచారం మాని ప్రజా సంక్షేమం చూడు బాబూ
పెనుకొండ రూరల్: ‘‘ఎంతసేవు ప్రచార యావేనా...ప్రజా సంక్షేమం గురించి ఏనాడైనా పట్టించురున్నారా...గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ అమలు చేసినా పథకాలన్నింటికీ మంగళం పాడారు. నిరుపేదలను అష్టకష్టాలు పెడుతున్నారు. ఇప్పటికై నా ప్రచార యావ మానుకుని ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోండి’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ముఖ్యమంక్రి చంద్రబాబుకు హితవు పలికారు. సంక్షేమ పథకాలు పేర్లు మారుస్తున్న చంద్రబాబు..ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆమె పెనుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కేవలం జగన్‌కు పేరు వస్తుందన్న కక్షతోనే అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చారని, కానీ విజ్ఞులైన ప్రజలు ఆ పథకం ఎవరు తెచ్చారో చెబుతారన్నారు. అలాగే తమ హయాంలో అమలు చేసిన రైతు భరోసా పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’గా మార్చి అరకొరగా అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ మోహన్ రెడ్డి పాలన సాగించారని, దీన్ని ఓర్వలేని టీడీపీ నాయకులు, రాష్ట్రం శ్రీలంకలాగా దివాళా తీస్తుందని అన్నారని, ఇప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. కేవలం 18 నెలల వ్యవధిలోనే అప్పుగా రూ.3 లక్షలకోట్లకుపైగా తెచ్చిన చంద్రబాబు...వాటిని ఏం చేశారో అందరికీ చెప్పాలన్నారు.
సర్వే ఘనత జగన్‌దే..
భూ సమస్యలను పరిష్కరించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ రాష్ట్ర భూముల రీ సర్వే చేపట్టారన్నారు. ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్న కేంద్రం కూడా జగన్‌ను మెచ్చుకుని రూ.400 కోట్ల రివార్డు ఇచ్చిందన్నారు. ఇలాంటి పనులు చేయడం మాని.. గత ప్రభుత్వంలో వేసిన సర్వే రాళ్లపై పేర్లను తుడిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.15 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల కళ్లారా చూసిన వైఎస్ జగన్...రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెడికల్ కళాశాలలు తీసుకు వస్తే, జగన్ మోహన్ రెడ్డికి ఈ క్రెడిట్‌ను దక్కకుండా చూసేందుకు చంద్రబాబు ‘పీపీపీ’ అంటూ కొత్త నాటకానికి తెరతీశారన్నారు. ఆయన ఎన్ని నాటకాలు చేసినా జనం నమ్మబోరన్నారు. సమావేశంలో మధుమతి, నరసింహ, కొండల రాయుడు పాల్గొన్నారు.
పథకాల పేర్లు మారిస్తే
ప్రజలు నమ్మరని తెలుసుకోండి
అప్పుగా తెచ్చిన రూ.3 లక్షల కోట్లు
ఎక్కడికెళ్లాయో చెప్పాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్ డిమాండ్


