నేడు పెనుకొండలో ‘అనంత ఆణిముత్యాలు’
● ఉమ్మడి అనంతపురం జిల్లా
ప్రముఖులకు సన్మానాలు
పెనుకొండ: వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ‘అనంత’ కీర్తిని దశ దిశలా చాటుతున్న ప్రముఖులను సాహితీ గగన్‌మహల్ ట్రస్ట్ ‘అనంత ఆణిముత్యాలు’ పేరుతో మూడేళ్లకోసారి సన్మానిస్తోంది. ఈ క్రమంలోనే 9వ ‘అనంత ఆణిముత్యాలు’ పురస్కార ప్రధానోత్సవ శనివారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరగనుంది. ఈసారి 21 మందిని సన్మానిస్తున్నట్లు గగన్‌మహల్ ట్రస్ట్ నిర్వాహకుడు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు, యువతీ యువకులు, విద్యావంతులు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.
వైఎస్సార్ సీపీ కమిటీల్లో జిల్లా వాసులకు చోటు
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లోని పలు కమిటీల్లో జిల్లా వాసులకు చోటు దక్కింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలువురు నాయకులకు పార్టీ రాష్ట, జిల్లా కమిటీల్లో చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జి. గంగాద్రి (పుట్టపర్తి), సంయుక్త కార్యదర్శిగా పి. శంకర్ (పుట్టపర్తి), ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా జె. తిప్పేస్వామి (మడకశిర ), ఉద్యోగులు, పెన్షనర్ల కమిటీ సంయుక్త కార్యదర్శిగా పి.అశ్వర్థనారాయణ (పుట్టపర్తి)ను నియమించారు. ఇక జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా టి. తిమ్మారెడ్డి (మడకశిర), సంయుక్త కార్యదర్శిగా టీడీ చంద్రశేఖర్‌రెడ్డి (పుట్టపర్తి), మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం. హబీబుల్లా (పుట్టపర్తి), బీసీ సెల్ జిల్లా కార్యదర్శిగా ఎం.రవి( పుట్టపర్తి )ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పచ్చని చెట్లపై గొడ్డలి వేటు
● కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
● ఎన్‌హెచ్–716జీ నిర్మాణం కోసం
వందలాది చెట్లు నేలమట్టం
● స్పందించని అటవీ, రెవెన్యూ,
హైవే అథారిటీ అధికారులు
హిందూపురం టౌన్: హిందూపురం– గోరంట్లకు మధ్య ఏర్పాటు చేస్తున్న ఎన్‌హెచ్–716జీ
నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా వందలాది చెట్లను నేలమట్టం చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాల్సి వస్తే మరోచోట నాటాలని కలెక్టర్ ఆదేశించినా కాంట్రాక్టర్ బేఖాతరు చేశారు. ఈ మార్గంగుండా దాదాపుగా 1000పైగా చెట్లు ఉండగా..రహదారి నిర్మాణం కోసం కాంట్రాక్టర్ ఇప్పటికే 500లకుపైగా చెట్లను నేలమట్టం చేశాడు. ఓ వైపు పర్యావరణ హితానికి కృషి చేయాలని ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు చెబుతుంటే, మరో పక్క చెట్లను నేలమట్టం చేస్తుండటంపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల నేలమట్టంపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందించడం లేదని పర్యావరణవేత్త భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల తొలగింపుపై గ్రీన్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయిస్తామన్నారు. దీనిపై కలెక్టర్, అటవీ శాఖ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.


