కుమార్తెతో కలిసి తల్లి అదృశ్యం
బత్తలపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో కుమార్తెతో కలిసి తల్లి కనిపించకుండా పోయింది. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లిలోని కోటి కాలనీలో నివాసముంటున్న గోగుల రాజు, పూజిత దంపతులకు మూడేళ్ల కుమార్తె అక్షర ఉంది. పూజిత తన భర్తకు తెలియకుండా డ్వాక్రా సంఘంలో నెల క్రితం రూ.9 వేలు తీసుకుని ఖర్చు చేశారు. ఈ విషయంగా దంపతులు తరచూ గొడవపడేవారు. గురువారం ఉదయం కూడా గొడవపడిన అనంతరం రాజు.. తాడిమర్రి మండలం నార్శింపల్లిలో బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లాడు. తిరిగి 11 గంటలకు ఇంటికి చేరుకుని చూడగా పూజిత, కుమార్తె అక్షర కనిపించలేదు. గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హంద్రీ–నీవాను డ్రెయినేజీగా మార్చేశారు
● వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక
రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ రమణ
నల్లచెరువు: సాగు, తాగునీటి అవసరాల కోసం రూపొందించిన హంద్రీ–నీవా ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసి డ్రెయినేజీగా మార్చేసిందని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ రమణ ధ్వజమెత్తారు. నల్లచెరువు మండలం దేవరింటిపల్లిలో గురువారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ – రచ్చబండ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌ను టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్‌టీఆర్ ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ తర్వాత వెన్నుపోటుతో అధికారం చేపట్టిన చంద్రబాబు... ఎన్‌టీఆర్‌కు పేరు రాకూడదనే స్వార్థంతో హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌ను 40 నుంచి కేవలం 5 టీఎంసీలకు కుదిస్తూ తాగునీటి ప్రాజెక్ట్‌గా మార్చేశారని మండిపడ్డారు. ఆ తరువాత 2004లో అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞంలో భాగంగా మొదటి దశలో 80 శాతం, రెండో దశలో 60 శాతం పనులను పూర్తి చేసి, 2012లోనే జీడిపల్లికి కృష్ణా జలాలను అందించారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది జనాబాకు తాగునీరు కోసం డిజైన్ చేశారన్నారు. దీని లక్ష్యం నెరవేరాలంటే కనీసం 75 టీఎంసీల నీళ్లు వస్తే తప్ప సాధ్యం కాదన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్ట్‌ను నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడో పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసి, నేడు రూ.3,850 కోట్ల ప్రజాధనం వెచ్చించి కుప్పం ప్రాంతానికి నీటిని తరలించుకుపోవడంతో సిగ్గు చేటన్నారు. రూ.3,850 కోట్లు ఖర్చు చేసినా తొలి విడతలో 2,200 క్యూసెక్కులు, రెండో విడతలో 130 క్యూసెక్కుల నీళ్లు కూడా రాలేదంటే ఈ పనులు ఎవరి కోసం చేశారో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఈ పనుల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. నేర ప్రవృత్తి ఉన్న ఎమ్మెల్యే కందికుంట మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందన్నారు.


