
దొంగలను చేసిన జల్సాలు
పుట్టపర్తి టౌన్: వారంతా జల్సాల కోసం దొంగలుగా మారారు. ఇళ్లు, ఆలయాలు, పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడ్డారు. బాధితుల ఫిర్యాదుతో నిఘా వేసిన పోలీసులు వివిధ కేసులకు సంబంధించి 11 మంది దొంగలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి బంగారు నగలు, అల్యూమినియం, అమ్మవారి విగ్రహాల వెండి ముఖాలతో పాటు ఒక కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్‌కుమార్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు విజయకుమార్, శివన్నారాయణస్వామితో కలిసి మీడియాకు వెల్లడించారు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్..
ఇటీవలి కాలంలో పుట్టపర్తి పట్టణం, బ్రాహ్మణపల్లి, ఓడీచెరువు, గోరంట్ల, సోమందేపల్లి, కియా పోలీస్ స్టేషన్ ఏరియా, రొద్దం ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలు జరిగాయి. పుట్టపర్తి డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ శివాంజనేయులు, ఏఎస్‌ఐ మధుసూదన్‌రావ్, కానిస్టేబుల్ శంకరప్పతో పాటు సిబ్బంది ఒక బృందంగా ఏర్పడ్డారు. చోరీలు జరిగిన ప్రదేశాల్లో వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీలన్నీ బెంగళూరుకు చెందిన చంతన్ అనే వ్యక్తి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న నరసింహమూర్తి పనే అని తేల్చారు. అతని కోసం నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 17న తాను దొంగిలించిన సొమ్మును పుట్టపర్తిలోని ఎస్‌బీఐ వద్ద ఓ షాపులో అమ్మతుండగా నిందితుడు నరసింహమూర్తిని పుట్టపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.12 లక్షల విలువచేసే వంద గ్రామల బంగారు ఆభరణాలు, ఒక కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొన్నారు. బెట్టింగ్, చెడు వ్యసనాలకు అలవాటుపడి.. వాటికి అవసరమైన డబ్బు కోసం ఇలా దొంగగా మారినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.
వైర్ల కోసం ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..
ఓడీచెరువు, నల్లమాడ, అమడగూరు, బుక్కపట్నం, పుట్టపర్తి రూరల్, రామగిరి, కదిరి, తలుపుల, గాండ్లపెంట మండలాల్లో ఏడాది కాలంగా ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి.. అందులోని వైర్లను అపహరించుకుపోతున్నారు. బాధిత రైతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక టీమ్‌గా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించి నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన రంగనాథ, బుక్కపట్నం మండం చండ్రాయునిపల్లికి చెందిన గణేష్, ఎన్‌పీ కుంట మండల దాసరవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ, మహమ్మద్ రఫి, నల్లమాడ మండలం మాలప్పగారిపల్లికి చెందిన సి.వెంకటేష్, సోమందేపల్లి గ్రామానికి చెందిన సాదిక్‌ఖాన్‌లను నిందితులుగా గుర్తించారు. వీరిపై పై తొమ్మిది స్టేషన్లలో 22 కేసులు నమోదయ్యాయి. 51 ట్రాన్స్‌ఫార్మర్లు పగులగొట్టి.. అందులో ఉన్న అల్యూమినియం, కాపర్‌వైర్‌ను తీసి విక్రయిస్తుంటారని తేలింది. అలా రాత్రి వేళల్లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద దొంగిలిస్తుండగా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.5 లక్షలు విలువచేసే 657 కేజీల అల్యూమినియం వైర్ స్వాధీనం చేసుకున్నారు.
దేవుని సాక్షిగా దొంగతనాలు..
కదిరి పరిసర ప్రాంతాల్లోని వివిధ ఆలయాల్లో ఆరు నెలలుగా చోరీలు జరుగుతున్నాయి. ఆయా స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసిన పోలీసులు..ఆలయాల్లో చోరీలకు పాల్పడిన దొంగలు కావడి శ్రీనివాసులు (తిరుపతి జిల్లా), బండి సోముశేఖర్, మెనుపడి రమేష్ (అన్నమయ్య జిల్లా), కొండాచారి (కర్ణాటక రాష్ట్రం చింతామణి)గా గుర్తించారు. ఈ నలుగురు అంతర్‌జిల్లా దొంగలను అరెస్ట్ చేసి, రూ.1.16 లక్షల నగదు, నాలుగు బంగారు తాళిబొట్లు, నాలుగు అమ్మవారి వెండి విగ్రహాల ముఖాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గరు నిందితులు రాజేంద్ర, శేఖర్, అరుణాచలం పరారీలో ఉన్నారు.
● నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ కేసుల్లోని నిందితుడు నల్లమాడ మండలం మాలప్పగారిపల్లి వెంకటేష్ సోదరి దుర్గమ్మ, సర్పంచ్ రామ్మోహన్‌రెడ్డిని ఎస్పీ సతీష్‌కుమార్ పూలమాలతో సత్కరించారు. నేరస్తుల పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐలు నరేంద్రరెడ్డి, శివాంజనేయులు, నారాయణరెడ్డి, నిరంజన్‌రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు మక్బూల్‌బాషా, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వివిధ కేసుల్లో 11 మంది అరెస్ట్
నగలు, వస్తువులు, నగదు, కారు, సెల్‌ఫోన్ల స్వాధీనం