
స్వచ్ఛాంధ్రలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదాం
నల్లమాడ: స్వచ్ఛాంధ్రలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం నల్లమాడ మండలంలో పర్యటించిన ఆయన స్వచ్ఛాంధ్రలో భాగంగా పలుచోట్ల మొక్కలు నాటారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలసి మొక్కలు నాటిన కలెక్టర్.. బాసంవారిపల్లి గ్రామస్తులకు మొక్కలు అందజేశారు. అక్కడి నుంచి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ సైకిల్ ముందు భాగంలో విద్యార్థిని కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కడం విశేషం. తర్వాత చౌటకుంటపల్లి వద్ద రైతు పద్మనాభ రెడ్డి పొలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. సూర్య ఘర్ పథకం కింద ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. పంటలకు సేంద్రియ ఎరువుల వాడకంతో కలుషితం లేని దిగుబడిని, తద్వారా నాణ్యమైన ఆహారాన్ని పొందవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కలు నాటాలని, నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్..
నల్లమాడ కస్తూరిబా పాఠశాలను కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థినులకు పాఠం చెప్పారు. పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈఓ క్రిష్టప్ప, పలువురు జిల్లా అధికారులు, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన కలెక్టర్ శ్యాం ప్రసాద్