
ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే
కదిరి టౌన్/ ధర్మవరం అర్బన్/ మడకశిర: ప్రభుత్వ వైఫల్యాలు, నకిలీ మద్యం రాకెట్‌పై వరుస కథనాలు రాస్తుండటాన్ని తట్టుకోలేక సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడేనని రాజకీయ, జర్నలిస్టు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు ఖండిస్తున్నారు. పత్రికపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
మీడియాపై అక్రమ కేసులు హేయం
నకిలీ మద్యంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రచురించినందుకు ‘సాక్షి’ మీడియాపై కూటమి సర్కారు అక్రమ కేసులు పెట్టి వేధించడం హేయమైన చర్య. అలవికాని హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదు. పత్రికా స్వేచ్ఛను హరించడం మంచిది కాదు.
– ఎస్‌ఎండీ ఇస్మాయిల్, వైఎస్సార్‌సీపీ
మాజీ సమన్వయకర్త, కదిరి
పత్రికా స్వేచ్ఛకు తూట్లు
పత్రికా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. హైదరాబాద్ సాక్షి కార్యాలయం వద్ద నెల్లూరు పోలీసులు ఎడిటర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు హడావుడి చేయడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. నిజాన్ని రాసే పత్రికలకు కూటమి ప్రభుత్వం కేసులు, నోటీసులు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ చర్యను ప్రతిఒక్కరూ ఖండించాలి. – మాసపల్లి సాయికుమార్,
వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు
నోటీసుల పేరుతో వేధించడం తగదు
నోటీసుల పేరుతో పోలీసులు వేధించడం పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే. నిజాలను రాసే జర్నలిస్టులకు స్వేచ్ఛ కల్పించాలి. అంతే కానీ వార్తలు నచ్చలేదని జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులకు దిగడం హేయమైన చర్య. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే జర్నలిస్టులపై అధికార జులుం ప్రదర్శించరాదు. వార్త ప్రచురించినందుకు సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసుల పేరుతో వేధించడం తగదు. – పొగాకు రామచంద్ర,
వైఎస్సార్‌సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే

ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే

ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే