
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయం
పుట్టపర్తి అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించాలని, ఇందుకు ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పుట్టపర్తి మండలం బొంతలపల్లి, చెర్లోపల్లి, వెంగళమ్మచెరువు, అమగొండపాళ్యం, కప్పలబండ, జగరాజుపల్లి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘రచ్చబండ’, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, డిజిటల్ బుక్ ఆవిష్కరణ, పోస్టర్ల విడుదల కార్యక్రమాలు నిర్వహించారు. బొంతలపల్లి, చెర్లోపల్లిలో పార్టీ పరిశీలకులతో కలిసి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రసంగించారు. మున్సిపల్, జిల్లాపరిషత్, మండల పరిషత్, సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరచి.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఏ గ్రామంలో చూసినా మద్యం ఏరులై పారిస్తూ కూటమి నేతలు జేబులు నింపుకొంటున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ముందు చూపుతో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్ క్లినిక్‌లు నిర్మిస్తే కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తోందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, 342 జాతీయ రహదారి, 193 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమాలను చేపడితే అవన్నీ తమ ఘనతే అంటూ ప్రస్తుత ప్రజాప్రతినిధులు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే డమ్మీగా మారిపోయారన్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గ్యాంబ్లింగ్ కేంద్రంగా మార్చారని విమర్శించారు. కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా పట్టించుకోలేదన్నారు. ఇవన్నీ కూటమి నాయకులకు ఏటీఎంలుగా మారిపోయాయన్నారు.
ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం అందనిద్రాక్షే..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం, అందుబాటులో వైద్య విద్య ఉండేందుకు రాష్ట్రానికి 17 కొత్త మెడికల్ కళాశాలలు తీసుకొస్తే.. వాటిని కొనసాగించకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని కుట్ర చేస్తోందని దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ చేస్తే పేదలకు వైద్యం అందని ద్రాక్షే అవుతుందని, వైద్య విద్య అభ్యసించలేని పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, అగ్రీ అడ్వయిజరీ జిల్లా మాజీ చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, వైస్ ఎంపీపీ హనుమంతరెడ్డి, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు ఈశ్వరయ్య, రవినాయక్, మాజీ కన్వీనర్లు గంగాద్రి, నరసారెడ్డి, సొసైటీ మాజీ డైరెక్టర్ ఈశ్వరరెడ్డి, పరిశీలకులు మాధవరెడ్డి, ఫొటోసాయి, సంజీవరెడ్డి, చౌడిరెడ్డి, పోతిరెడ్డి, నాయకులు బయపరెడ్డి, నాగరాజు, తిప్పారెడ్డి, కుల్లాయప్ప, వెంకటేషు, ఓబుళప్ప, ఎరదొడ్డి, నరేష్, సర్పంచ్ వెంకటేషు, సర్పంచ్ లక్ష్మీనరసమ్మ, మాజీ ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి, రమణారెడ్డి, అగ్రీ బోర్డు మాజీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట,
పరిశీలకులు రఘునాథరెడ్డి

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయం